లిక్కర్ స్కాంలో మరో ట్విస్టు.. కొత్తగా కేసు నమోదు, ఈ సారి బలయ్యేది ఎవరో?
ఈ కాంట్రాక్టును మద్యం స్కాంలో ఏ1 అయిన రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించారని
By: Tupaki Political Desk | 14 Feb 2026 4:16 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో మరో కోణాన్ని ప్రభుత్వం బయటపెట్టింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసిరకం మద్యం అమ్మడం ద్వారా రూ.3,500 కోట్ల మేర కుంభకోణం జరిగిందని కేసు పెట్టిన ప్రభుత్వం తాజాగా మరో కేసు నమోదు చేసింది. ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టులో అడ్డగోలు ధరలతో ప్రజాధనం కొల్లగొట్టారని, ఈ వ్యవహారంలో సుమారు రూ.400 కోట్లు పక్కదారి పట్టాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న సిట్ కే బాధ్యతలు అప్పగించింది. ఈ పరిణామంతో లిక్కర్ స్కాం నిందితుల్లో మళ్లీ గుబులు మొదలైందని అంటున్నారు.
మద్యం రవాణా పేరిట రూ.400 కోట్ల విలువైన స్కాం జరిగిందని సిట్ అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ స్కాంకు సంబంధించి కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తమ దర్యాప్తులో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 10న కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఐపీసీలోని సెక్షన్ 420, 409, 468, 471, 120(బి)తోపాటు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 111, 212, 217, 317 కింద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లలో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండటంతో నిందితులు జైలుకు వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు. లిక్కర్ స్కాం దర్యాప్తు సమయంలోనే ట్రాన్స్ పోర్టు విభాగంలో జరిగిన కుంభకోణాన్ని గుర్తించిన సిట్ అధికారులు అందుకు బాధ్యుల పేర్లు కూడా రాసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో త్వరలో అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఏంటీ కుంభకోణం
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే సొంతంగా దుకాణాలను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేసింది. ఈ దుకాణాలకు బెవరేజెస్ నుంచి మద్యం సరఫరా చేయడానికి ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు అప్పగించినట్లు చెబుతున్నారు. మద్యం తయారీ నుంచి డిపోల వరకు ఒక కాంట్రాక్టు, డిపోల నుంచి షాపులకు మరో కాంట్రాక్టు సంస్థకు రవాణా టెండర్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే షాపులకు సరకు రవాణా చేసేందుకు ఒక్కో కేసుకు ఉన్న ధర రూ.13 నుంచి రూ.34 పెంచేశారని సిట్ దర్యాప్తులో గుర్తించారని చెబుతున్నారు.
ఈ కాంట్రాక్టును మద్యం స్కాంలో ఏ1 అయిన రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించారని, అయితే ఈయన బినామీగా రాజ్ కేసిరెడ్డి మొత్తం దందా నడిపారని అంటున్నారు. ‘సిగ్మా’ అనే పేరుతో ఒక కాంట్రాక్టు కంపెనీ స్థాపించి రాష్ట్రంలో మద్యం దుకాణాలకు డిపోల నుంచి సరఫరా చేశారని చెబుతున్నారు. అయితే ఇలా కాంట్రాక్టు దక్కించుకున్న సిగ్మా సంస్థ రాష్ట్రంలోని ఐదుగురు ప్రముఖ వైసీపీ నేతలు, వారి బంధువులకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ నేత పేరుతోపాటు ఉత్తరాంధ్రలోని కీలక వైసీపీ నేత, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన మాజీ మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ నోటీసులు ఇచ్చి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
