Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతోంది. పరిపాలనలో డిజిటల్ సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు అసెంబ్లీ హాజరు ప్రక్రియలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది.

By:  Tupaki Political Desk   |   11 Feb 2026 4:04 PM IST
ఏపీ అసెంబ్లీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
X

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతోంది. పరిపాలనలో డిజిటల్ సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు అసెంబ్లీ హాజరు ప్రక్రియలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యేల హాజరు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'ఫేషియల్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) విధానాన్ని ప్రవేశపెడుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలు రిజిస్టర్లలో సంతకాలు చేయడం ద్వారా ఇప్పటి వరకు తమ హాజరు నమోదు చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు సభలో ఈ సంప్రదాయమే కొనసాగుతోంది. అయితే ఈ పాత పద్ధతిని సంస్కరించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు విధానం ద్వారా సభ్యుల హాజరును తీసుకోనేలా ఆధునిక టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు నమోదు చేయనున్నారు. ఈ విధానంలో సభ్యులు తమకు కేటాయించిన సీట్లో కూర్చున్న తర్వాతే ఏఐ ఆధారిత డిజిటల్ విధానం ద్వారా హాజరు నమోదు అవుతుంది. ఈ ఏఐ టెక్నాలజీ వల్ల సభ్యులు గతంలో మాదిరిగా సభకు ఆలస్యంగా వచ్చి సమావేశాలు ముగియకుండానే వెళ్లిపోవడానికి ప్రయత్నించినా తెలిసిపోతుంది. సభ్యుడు సభలో ఎంత సమయం గడిపింది? పక్కాగా తెలిసే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం సులువు అవుతుందని అంటున్నారు.

ఏఐ టెక్నాలజీ ద్వారా సభ్యులు ఎంత సమయం సభలో ఉన్నారనేది కచ్చితంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. సభ్యుడు తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చున్నా, ఏఐ టెక్నాలజీ ద్వారా అప్రమత్తం చేస్తుంది. సభ్యులు ఎక్కడ కూర్చొవాలో తెలియజేస్తుందని అంటున్నారు. ఇక సభ్యులు హాజరు నమోదు కోసం ఏఐ టెక్నాలజీకి ఉపకరించేలా ఇప్పటికే 175 మంది ఎమ్మెల్యేల ఫొటోలను వెక్టరైజేషన్ ద్వారా సేకరించినట్లు చెబుతున్నారు.

వెక్టరైజేషన్ అంటే సభ్యుల రూపురేఖలను గుర్తించేందుకు అవసరమైన కొలతలు తీసుకోవడం అన్నమాట. ఒక్కోఫొటోను 175 వెక్టర్ పాయింట్స్ గా తీసుకుని సాఫ్ట్ వేర్ లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని చెబుతున్నారు. సభలో పీటీజెడ్ (పాన్, టిల్ట్, జూమ్) కెమెరాలను ఏర్పాటు చేశారు. సభ్యుల హాజరు నమోదులో మానవ ప్రమేయం లేకుండానే ఎకాయొకిన డ్యాష్ బోర్డుకు సమాచారం చేరిపోతోందని అంటున్నారు.

ఈ కొత్త విధానాన్ని స్పీకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అసెంబ్లీ ఐటీ విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డిజిటల్ అసెంబ్లీ దిశగా ఏపీ వేస్తున్న ఈ అడుగు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.అంతర్జాతీయ స్థాయి పార్లమెంటరీ విధానాలను ఏపీ అసెంబ్లీలో అమలు చేయడం ద్వారా దేశంలోనే ఆదర్శంగా నిలవనుందని అంటున్నారు. నిజానికి మన దేశంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక ముందు వరుసలో ఉన్నాయి. ఏపీ ఇప్పుడు ఈ జాబితాలో చేరుతోంది.

దేశంలో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది జూలైలో నిర్వహించిన వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏఐ హాజరు నమోదు ప్రవేశపెట్టారు. ఆ సమావేశాల్లో పైలట్ ప్రాజెక్టుగా సభ్యులకు పరిచయం చేసినా సత్ఫలితాలు రావడంతో తర్వాత సమావేశాల నుంచి కొనసాగిస్తున్నారు. దీనివల్ల కేవలం అటెండెన్స్ మాత్రమే కాకుండా, ఎమ్మెల్యేలు సభలో ఎంతసేపు ఉన్నారు, ఏ ఏ అంశాలపై మాట్లాడారు, వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనే విషయాలను కూడా ఏఐ టెక్నాలజీ విశ్లేషిస్తోంది. గత నెల ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన స్పీకర్ల సదస్సులో ఈ టెక్నాలజీ కోసం తెలుసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇక మన పక్క రాష్ట్రం కర్ణాటకలో సైతం గత ఏడాది జులై నుంచి ఈ టెక్నాలజీని అమలులోకి తీసుకువచ్చారు. మరోవైపు ప్రస్తుత బడ్జెట్ సెషన్స్ లో పార్లమెంటులో కూడా డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఫేషియల్ రికగ్నిషన్‌తో పాటు సీట్ల వద్ద ఉండే బయోమెట్రిక్ (తంబ్ ఇంప్రెషన్) విధానాన్ని కూడా అనుసంధానించారు. అయితే లోక్ సభతోపాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీలలో అమలు చేస్తున్న విధానం కంటే ఏపీలో అమలు చేస్తున్న విధానం కొంత భిన్నంగా ఉండబోతోందని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు తమ సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదయ్యేలా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు. గతంలో కొందరు ఎమ్మెల్యేలు కేవలం సంతకం చేసి వెళ్ళిపోతున్నారనే విమర్శలు వచ్చేవి. ఈ ఏఐ విధానంతో అటువంటి 'ప్రాక్సీ' లేదా 'ఫేక్' అటెండెన్స్‌కు చెక్ పడుతుందని అంటున్నారు.