Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌ల క‌బ్జాలు.. స‌ర్కారు యాక్ష‌న్ ఉంటుందా.. ?

శ్రీకాకుళం నుంచి క‌ర్నూలు వ‌ర‌కు ప‌లు చోట్ల వైసీపీ నాయ‌కులు అధికారంలో ఉన్న‌ప్పుడు.. చేసిన భూక‌బ్జాల ప‌రంప‌ర తెర‌మీదికి వ‌చ్చింది.

By:  Garuda Media   |   20 July 2026 11:16 AM IST
వైసీపీ నేత‌ల క‌బ్జాలు.. స‌ర్కారు యాక్ష‌న్ ఉంటుందా.. ?
X

శ్రీకాకుళం నుంచి క‌ర్నూలు వ‌ర‌కు ప‌లు చోట్ల వైసీపీ నాయ‌కులు అధికారంలో ఉన్న‌ప్పుడు.. చేసిన భూక‌బ్జాల ప‌రంప‌ర తెర‌మీదికి వ‌చ్చింది. బ‌న‌గాన‌ప‌ల్లె, ఆముదాల వ‌ల‌స‌, మాచ‌ర్ల‌లో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు భూములు క‌బ్జా చేసిన వ్య‌వ‌హారం.. పెద్ద ఎత్తున ఇప్పుడు చ‌ర్చ‌ల‌కు దారి తీసింది. ఆముదాల వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుటుంబంపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇక‌, క‌ర్నూలు జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి భూఆక్ర‌మ‌ణ వ్య‌వ‌హారం కూడా దుమ్ము రేపుతోంది.

ఇక‌, మాచ‌ర్ల‌లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అనుచ‌రుడు కూడా భూ క‌బ్జా చేశాడంటూ.. బాధితులు తెర మీదికి వ‌చ్చారు. ఇవ‌న్నీ.. ఈ వారం వెలుగు చూసిన ఘ‌ట‌నలే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇక్క‌డే పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. వైసీపీ నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌భుత్వానికి ఇబ్బంది లేద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో అనూహ్యంగా అటు విశాఖ స‌హా ఇటు అనంత‌పురంలో టీడీపీ నాయ‌కుల వ్య‌వ‌హారం కూడా ఇలానే ఉంది.

ఆయా ప్రాంతాల్లో ప్ర‌స్తుతం భారీ ఎత్తున భూ క‌బ్జాల ఆరోప‌ణ‌లు వెలుగుచూశాయి. భీమిలిలో ప్ర‌భుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేసిన వ్య‌వ‌హారం ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టింది. అన‌కాప‌ల్లిలో గ‌నుల త‌వ్వ‌కాల వెనుక కీల‌క నేత‌ల పేర్లు వెలుగు చూశాయి. అలానే అనంత‌పురంలో ఓ ఎంపీ వ్య‌వ‌హారం స‌ర్కారుకు కాక‌పుట్టిస్తోంది. ఇలా.. అటు వైసీపీ నేత‌ల వ్య‌వ‌హారం వెలుగు చూస్తున్న స‌మ‌యంలోనే సొంత పార్టీ నాయ‌కుల దూకుడు కూడా తెర‌మీదికి రావ‌డంతో స‌ర్కారుకు చేతులుక‌ట్టేస్తున్న ప‌రిస్థితి ఏర్ప‌డేలా చేసింది.

వైసీపీపై చ‌ర్య‌లు తీసుకుంటే.. టీడీపీ నేత‌లపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల సంగ‌తి ఏంట‌నే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తాయి. పోనీ వ‌దిలేస్తే.. అది రాజ‌కీయంగా పార్టీకి ఇబ్బందిక‌రంగా మార‌నుంది. మొత్తంగా ఈ భూక‌బ్జాల వ్య‌వ‌హారం స‌ర్కారు పెను స‌మ‌స్య‌గా మారింది. సాధార‌ణ ప్ర‌జ‌ల్లో కూడా ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ జ‌రుగుతుండ‌డం.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో క‌బ్జాల ప‌ర్వంపై చ‌ర్య‌లు తీసుకునే బాధ్య‌త‌ను క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గిస్తున్నట్టు స‌ర్కారు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. కానీ, క్షేత్ర‌స్థాయిలో క‌లెక్ట‌ర్లు ఏమేర‌కు ప‌నిచేయ‌గ‌ల‌రు.. అనేది చూడాలి.