చినబాబు కంటే ముందే కోవా బన్ రుచి చూసిన కొల్లు
ఏదైనా వివాదానికి సంబంధించి ఒక పార్టీ అధినేత.. లేదంటే ముఖ్యనేత స్పందించి.. త్వరలో కలుస్తానని పత్రికా ముఖంగా చెప్పిన తర్వాత.. సదరు అగ్రనేత పర్యటన కోసం పార్టీ నేతలంతా ఎదురు చూస్తారు
By: Garuda Media | 19 Feb 2026 9:10 AM ISTరోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. ఏదైనా వివాదానికి సంబంధించి ఒక పార్టీ అధినేత.. లేదంటే ముఖ్యనేత స్పందించి.. త్వరలో కలుస్తానని పత్రికా ముఖంగా చెప్పిన తర్వాత.. సదరు అగ్రనేత పర్యటన కోసం పార్టీ నేతలంతా ఎదురు చూస్తారు. అందుకు భిన్నంగా ముఖ్యనేత కంటే ముందే వెళ్లటం సాధారణంగా జరగదు. అయితే.. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకుంది. ఏపీకి చెందిన కోవా బన్ వలీ ఇష్యూ తెలిసందే. సోషల్ మీడియా పుణ్యమా అని.. మోరల్ పోలీసింగ్ పేరుతో అతి చేసిన యూట్యూబర్ తీరును తీవ్రంగా ఖండించటమే కాదు.. ప్రతి విషయాన్ని మతంతో కాదు చూడాల్సింది మానవత్వంతో అన్న మెసేజ్ ఇవ్వటం అందరిని ఆకర్షిస్తోంది.
యూట్యూబర్ ఒకరు వీధుల్లో కోవా బన్ అమ్మే వలి వద్దకు వచ్చి.. నానా యాగీ చేయటం.. తన మాటలతో.. ప్రశ్నలతో బెంబేలెత్తించటం..దీనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బిక్కముఖం వేసిన వలీ.. తాను అమ్మే కోవా బన్ లో ఎలాంటి కల్తీ ఉండదని.. స్వచ్ఛమైన కోవాతోనే తాము తయారు చేస్తామన్న విషయాన్ని చెప్పినా సదరు యూట్యూబర్ వినలేదు. దీంతో.. తాను అమ్మే కోవా బన్ ను తానే తింటూ.. చూడండి సార్.. నేను చెప్పేది నిజమన్న మాటను మనసును కదిలించే తీరులో అతడి ముఖంలో కనిపించిన వేదన మనిషి అన్న ప్రతి ఒక్కరిని కదిలించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయటమే కాదు.. పలువురు అతడికి సంఘీభావంగా ముందుకు రావటం.. స్వచ్ఛందంగా అతడి వద్దకు వెళ్లి మద్దతు పలకటం.. అతడు అమ్మే కోవాబన్ ను రుచి చూడటం ద్వారా.. తప్పుడు చేష్టలకు చెప్పుదెబ్బ తప్పదన్న రీతిలో రియాక్టు అయ్యారు. వలీకి వస్తున్న ఆదరణ నేపథ్యంలో రాజకీయ నేతలు సైతం స్పందించటం షురూ చేశారు.
రెండు.. మూడు రోజుల క్రితం ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం కోవా బన్ వలీ ఇష్యూను ప్రస్తావిస్తూ..త్వరలోనే తాను కూడా వెళ్లి వలీ కోవా బన్ రుచి చూస్తానని చెప్పారు. లోకేశ్ స్వయంగా ప్రకటన చేసిన తర్వాత ఆయన కోసం ఎదురుచూడటం కామన్ గా జరిగేది. అందుకు భిన్నంగా తాజాగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కోవాబన్ వలీని కలిసి.. అతను అమ్మే బన్ ను రుచి చూసిన వైనం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. వలీ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.
మూడు తరాలుగా ఇదే వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్న సామాన్యులపై సోషల్ మీడియా పేరుతో అమానవీయంగా వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన కొల్లు.. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని తాను అనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. నిజానికి.. ఈ మాటలన్ని మంత్రి లోకేశ్ నోటి నుంచి రావాల్సి ఉండగా.. ఆయన కంటే ముందే కొల్లు రవీంద్ర ఈ మాటలు చెప్పేసిన వేళ.. చినబాబుకు స్క్రిప్టు లేకుండా చేశారన్న సరదా వ్యాఖ్య వినిపిస్తోంది. ఇంతకూ ఈ కోవా బన్ ను మంత్రి లోకేశ్ ఎప్పుడు రుచి చూస్తారో?
