Begin typing your search above and press return to search.

లోకేశ్ Vs డీకే శివకుమార్.. ఏమైందంటే..?

బెంగళూరులో వివిధ రకాల కారణాలతో పరిశ్రమలను తరలించాలని భావిస్తున్న వారికి ఏపీ రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం ఆసక్తికర అంశంగా మారింది.

By:  Tupaki Desk   |   19 Sept 2025 4:32 PM IST
లోకేశ్ Vs డీకే శివకుమార్.. ఏమైందంటే..?
X

కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య ఆసక్తికర మాటల సంవాదం కొనసాగుతోంది. బెంగళూరులో వివిధ రకాల కారణాలతో పరిశ్రమలను తరలించాలని భావిస్తున్న వారికి ఏపీ రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం ఆసక్తికర అంశంగా మారింది. గతంలో కర్ణాటకలో ఏరో స్పేస్ పార్క్ ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయిస్తే నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయా పరిశ్రమలకు ఏపీలో తగిన మౌలిక వసతులు కల్పిస్తామని, ఏపీకి రమ్మంటూ మంత్రి నారా లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు. ఇక తాజాగా బ్లాక్ బక్ అనే పరిశ్రమ సీఈవో బెంగళూరు రోడ్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. తమ పరిశ్రమను బెంగళూరు నుంచి తరలిస్తామని ప్రకటించారు.

బ్లాక్ బక్ సీఈవో రాజేష్ యాబాజీ చేసిన ట్వీట్‌ పై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విశాఖపట్నానికి కంపెనీని తరలించాలని ఆహ్వానించారు. విశాఖపట్నంలో మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, అలాగే మహిళలకు సురక్షితమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో కాక రేగింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే అక్కడి పరిశ్రమలు ఏపీకి తరలించాలని చూస్తున్నాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ బ్లాక్ బక్ సీఈవో రాజేశ్ యాబాజీ వంటివారు చేసిన వ్యాఖ్యలను తమ ప్రభుత్వం పట్టించుకోదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా సీఈవో రాజేశ్ యాబాజీ ట్వీట్ ను బ్లాక్ మెయిలింగు గా అభివర్ణించారు. బెంగళూరు నగరం ప్రపంచ సంస్థలకు ఆకర్షణీయ ప్రాంతంగా ఉందని, రోడ్ల మరమ్మతుల కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.1,100 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. గుంతలు సరిచేయడానికి కాంట్రాక్టర్లకు నవంబరు వరకు డెడ్ లైన్ ఇచ్చామని స్పష్టం చేశారు. శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ మరో మారు స్పందించారు.

డీకే శివకుమార్ వాడిన ‘బ్లాక్ మెయిల్’ పదానికి పరోక్షంగా సమాధానమిచ్చారు. ‘‘ఇతర రాష్ట్రాలకు ఏపీకి ఉన్న తేడా ఇదే. మా ప్రజల ఫిర్యాదులను మేం బ్లాక్ మెయిల్ అంటూ తోసిపుచ్చబోం. మేం వాటిని మర్యాదపూర్వకంగా స్వీకరించి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఎక్స్ లో లోకేశ్ పోస్టు చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వంతో నేరుగా మాటల యుద్దానికి లోకేశ్ సిద్ధమయ్యారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మంత్రి లోకేశ్ దూకుడుగా వ్యవహరిస్తున్నానేదానికి ఇదో నిరద్శనమని అంటున్నారు. బ్లాక్ బక్ సీఈవో ట్వీట్ పై మంత్రి లోకేశ్ స్పందించి ఆ పరిశ్రమను ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించినా, కంపెనీ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. కానీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల సంవాదం మాత్రం పెరుగుతున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు.