లోకేశ్ Vs ప్రియాంక ఖర్గే... ట్విటర్ లో మాటల యుద్ధం
ఇది ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులకు ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోందని తాజాగా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన ట్వీట్ ద్వారా అర్థమవుతోందని అంటున్నారు.
By: Tupaki Desk | 3 Oct 2025 1:01 PM ISTపరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధిపై ఏపీ, కర్ణాటక మధ్య రానురాను మాటల యుద్ధం ముదురుతోంది. కర్ణాటక నుంచి బయటకు వచ్చేస్తామని ప్రకటనలు చేస్తున్న పరిశ్రమలను ఆకర్షించేందుకు ఏపీ మంత్రి లోకేశ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇది ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులకు ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోందని తాజాగా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన ట్వీట్ ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. గతంలో రెండు మూడు సార్లు కర్ణాటకలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తమ పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తామని ఆ రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమల ప్రతినిధులు బహిరంగ ప్రకటనలు చేశారు. అప్పుడు లోకేశ్ స్పందిస్తూ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్ పరుస్తామని ప్రకటించారు. దీంతో కర్ణాటక మంత్రులు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకకు చెందిన మాధ్యూఫిలిప్ అనే వ్యక్తి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఉత్తర దిక్కు వైపు ఐటీ కంపెనీల విస్తరణకు ప్రోత్సాహం ఇవ్వాలని ట్విటర్ లో కోరారు. దీనిపై ఏపీ మంత్రి లోకేష్ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గేను ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు నగరానికి ఉత్తరం వైపు అనంతపురం నగరం ఉందని, అక్కడ ఐటీ, ఏరో స్పేస్ పరిశ్రమలు పెట్టేందుకు అనుకూల వాతావరణం, కావాల్సినంత భూమి ఉందని లోకేశ్ ట్వీట్ చేశారు. ఇది కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు కోపం తీసుకువచ్చింది.
మంత్రి లోకేశ్ ట్వీట్ పై కర్ణాటక ఐటీ మంత్రి స్పందిస్తూ ఏపీని ‘పరాన్నజీవి’ అంటూ నిందించడం తీవ్ర దుమారానికి దారితీస్తోంది. "బలహీనమైన పర్యావరణ వ్యవస్థలు బలమైన వాటిపై ఆధారపడటం సహజం. దీనిలో తప్పు ఏమీ లేదు, కానీ అది నిస్సహాయంగా దేనికోసం అల్లాడే దుస్థితికి మారితే, అది బలాన్ని కాకుండా మరింత బలహీనతనే చూపిస్తుంది." అంటూ ఖర్గే ట్వీట్ చేశారు. అంతేకాకుండా బెంగళూరు నగరం మరో పదేళ్ల వరకు 8.5 శాతం వృద్ధి చెందుతుందని, ఈ ఏడాది బెంగళూరు ఆస్తి విలువ 5% పెరుగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం 2033 నాటికి పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణల విషయంలో బెంగళూరు ప్రపంచంలోని ఇతర నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వలస వచ్చిన వారిని అత్యధికంగా ఆకర్షించే భారతీయ నగరాల్లో బెంగళూరు ఒకటిగా ఆయన అభివర్ణించారు.
అయితే, కర్ణాటక మంత్రిగా ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఖర్గే ఎలాంటి ప్రకటన అయినా చేయొచ్చు కానీ, లోకేశ్ ట్వీట్ ను ఉటంకిస్తూ ఏపీని పరాన్నజీవిగా పోల్చడమే విమర్శలకు దారితీస్తోంది. గతంలో కూడా కర్ణాటకలో మౌలిక సదుపాయాలు ప్రధానంగా రోడ్లు సరిగా లేకపోవడంతో తమ పరిశ్రమను ఇతర ప్రాంతానికి తరలిస్తామని ఆ రాష్ట్రానికి చెందిన ఓ సీఈవో ట్విటర్ లో ప్రకటించారు. దీనిని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ్లాక్ మెయిలింగుగా అభివర్ణించారు. అయతే మంత్రి లోకేశ్ కల్పించుకుని ప్రజల అవసరాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉంటామని, అది బ్లాక్ మెయిలుగా చూడమని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణలో పోటీ తీవ్రరూపం దాల్చుతున్నట్లు చెబుతున్నారు. మంత్రి లోకేశ్ చొరవ, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలతో కర్ణాటకలో ఏర్పాటు చేయాల్సిన మిట్టల్ స్టీల్ విశాఖపట్నం తరలిరావాలని డిసైడ్ అయింది. అదేవిధంగా బెంగళూరులో ఏరో స్పేస్ పరిశ్రమలకు తగిన స్థలం లేకపోవడంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు బెంగళూరు, చెన్నై మెట్రో సిటీలకు అతి సమీపంలో ఉండటంతో రాష్ట్ర సరిహద్దుల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం క్రమంగా పెరుగుతోంది.
