Begin typing your search above and press return to search.

ఈ జూన్ 12 చాలా స్పెషల్ గురూ..!

ఏపీలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు చంద్రబాబు సొంతం. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చిరస్మరణీయ విజయం సాధించిన చంద్రబాబు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 9:30 PM IST
ఈ జూన్ 12 చాలా స్పెషల్ గురూ..!
X

జూన్ 12.. ఎప్పుడూ వచ్చేదే కావొచ్చు.. కానీ, ఈ సారి కాస్త స్పెషల్ అంట.. ఏటా జూన్ 12న స్కూల్స్ తెరచుకుంటాయి. తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడతాయి. అయితే ఈ సారి ఆ అవసరం ఉండదని అంటోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు తీసుకుని ఈ జూన్ 12న రెండో ఏడాదిలోకి అడుగు పెట్టనున్నారు. 97 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ నెల 12న గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని చూస్తోంది. అందుకోసం చాలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈ నెల 12న మామూలుగా ఉండదు గురూ అంటూ హోప్స్, హైప్స్ క్రియేట్ చేస్తోంది.

ఏపీలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు చంద్రబాబు సొంతం. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చిరస్మరణీయ విజయం సాధించిన చంద్రబాబు.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తన మంత్రివర్గంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యమిచ్చారు. ఈ ఇద్దరూ కలిసి ఏడాది పాలనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లామని చెబుతున్నారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోయడంతోపాటు విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పెట్టుకుని మరో పాతికేళ్లు అధికారం చలాయించాలని చూస్తున్న కూటమి నేతలు.. తమ ప్రభుత్వం ఏర్పడిన 12వ తేదీన ప్రజలు అంతా పండగ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఏటా సంక్రాంతి, దసరా, దీపావళి వస్తుంటాయి.. ఈ ఏడాది ఆ మూడు పండగలు ఒకేసారి వచ్చాయన్నంత సంబరం చేసుకోవాలని కూటమి నేతలు పిలుపునిస్తున్నారు. దీంతో జూన్ 12న గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం ఏర్పడిందనే ఆనందంతో కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటే ఈ సారి ప్రజలంతా వేడుక చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. దీంతో జూన్ 12న తల్లికివందనం పథకం అమలు చేయడంతోపాటు అన్నదాతా సుఖీభవ పథకం నిధులను ఆ రోజే విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ రెండు పథకాలతో ప్రతి ఇంటా కనీసం 30 నుంచి 40 వేల ప్రయోజనం దక్కుతుందని కూటమి కార్యకర్తలు చెబుతున్నారు.

తల్లికి వందనం కింద ఇంట్లో ఎందరు పిల్లలు చదువుకుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా అన్నదాతా సుఖీభవ పథకంలో రైతుల అకౌంట్లకు తొలివిడత రూ.5 వేలు చొప్పున జమ చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధిని ప్రజలకు అందజేయాలనే లక్ష్యంతో జూన్ 12న గ్రామ గ్రామ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని, రోడ్లు, కాలువలు, సామాజిక భవనాలు వంటి గ్రామస్థాయి కనీస అవసరాలపై దృష్టి పెట్టి ఆయా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి ఒకేసారి పట్టాలెక్కించి ప్రజలకు నిజమైన వేడుక పరిచయం చేయాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని అంటున్నారు.