Begin typing your search above and press return to search.

23 నెలలు.. 23 లక్షల కోట్లు.. 24 లక్షల ఉద్యోగాలు.. చంద్రబాబు మైండ్ బ్లోయింగ్ లెక్కలు

పుట్టిపర్తి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర లెక్కలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో సాధించిన ప్రగతిని గణాంకాలతో సహా వివరించారు

By:  Tupaki Desk   |   15 May 2026 6:12 PM IST
23 నెలలు.. 23 లక్షల కోట్లు.. 24 లక్షల ఉద్యోగాలు.. చంద్రబాబు మైండ్ బ్లోయింగ్ లెక్కలు
X

పుట్టిపర్తి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర లెక్కలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో సాధించిన ప్రగతిని గణాంకాలతో సహా వివరించారు. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం నిర్మాణానికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు గత పాలనలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం చేశారని ఆరోపించారు. ‘‘పరిశ్రమలను తరిమేశారు, సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ గండం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో 'ఏపీ బ్రాండ్'ను మళ్లీ పునరుద్ధరించామని’’ వెల్లడించారు.

ఈ కొద్ది కాలంలోనే... కేవలం 23 నెలల్లోనే రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులను మనం సాధించగలిగాం. వీటి ద్వారా రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో దాదాపు 24 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మూడు భారీ ‘ఎకనామిక్ రీజియన్లు’ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు రాగా, త్వరలోనే రిలయన్స్, బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. సామాజిక బాధ్యతతో అనంతపురంలో సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు విదేశీ విరాళాల విషయంలో సమస్య వస్తే, మంత్రి లోకేష్ కేంద్రంతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించారు. అదీ మన ప్రభుత్వ పనితీరు అంటూ ముఖ్యమంత్రి వివరించారు.

రాయలసీమలో ఇనుపఖనిజం, సున్నపు రాయి లాంటి ఖనిజ వనరుల్ని సమర్ధంగా వినియోగించుకుంటామని సీఎం వివరించారు. కడప స్టీల్ ప్లాంటును జూన్ లో ప్రారంభిస్తామని, 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని అన్నారు. స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ లాంటి పరిశ్రమలతో రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు. కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా మారుతుందని, తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాంట్, శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. కియా పరిశ్రమలో తయారైన 18 లక్షల కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయని వెల్లడించారు.

నాడు KGF... నేడు JGF

ఇక త్వరలో కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో ప్రారంభమయ్యే గోల్డ్ మైన్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. మనకు గోల్డెన్ ఛాన్స్ అంటూ చెప్పిన చంద్రబాబు గతంలో గోల్డ్ అంటే KGF గుర్తుకు వచ్చేది. ఇప్పుడు గోల్డ్ అంటే JGF గుర్తుకు రాబోతుందని అన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (JGF) రాష్ట్రానికి వరంగా మారనుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ప్రారంభించనున్న ఈ గోల్డ్ మైన్ నుంచి తొలి ఏడాది 600 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నామని తెలిపారు. ఏటా ఉత్పత్తి సామర్థ్యం పెంచుతామని, దేశ అవసరాలు తీర్చేలా బంగారం ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు.