చివరి నిమిషంలో 'అమరావతి' క్యాన్సిల్ చేశారా? ఏమైంది?
రాష్ట్ర సచివాలయం వెనుక వైపు గతంలో పీ4 బహిరంగ సభ నిర్వహించిన మైదానంలో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
By: Tupaki Desk | 15 Aug 2025 1:00 PM ISTదేశవ్యాప్తంగా ఈ రోజు 79వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఆ రాష్ట్ర రాజధానిలో స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్ని తాకేలా చేపట్టారు. కానీ, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజధాని అమరావతిలో కాకుండా, పక్కనే ఉన్న విజయవాడ నగరం స్వాతంత్ర్య వేడుకలకు వేదిక అయింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించడానికి కుదరడం లేదు. ఈ ఏడాది రాజధాని అమరావతిలోనే ఈ వేడుకలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినా చివరి నిమిషంలో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత వేర్వేరు చోట స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం. 2014లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోనే వేడుకలు నిర్వహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో ప్రభుత్వం తరఫున స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా 2015లో తిరుపతి, 2016లో అనంతపురం, 2017లో విశాఖపట్నంలో నిర్వహించారు. 2018లో విజయవాడలో ఈ కార్యక్రమం జరిపారు. 2019లో ఆగస్టు 15 వేడుకల నాటికి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడంతో అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ స్వాతంత్ర్య వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు విజయవాడలోనే స్వాతంత్ర్య సంబరాలు జరిగాయి. ఇక గత ఏడాది మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా విజయవాడలోనే స్వాతంత్ర్య సంబరాలు కొనసాగించింది.
2015లో ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. 2015 ఏప్రిల్ లో రాజధాని అమరావతిని గుర్తించినా, అప్పట్లో తగిన మైదానం లేకపోవడం వల్ల ఆగస్టు 15 వేడుకలను అమరావతిలో నిర్వహించ లేకపోయారు. ఆ తర్వాత ఏడాది నాటికి రాజధాని కోసం సుమారు 34 వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. అయినప్పటికీ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించేందుకు తగిన మైదానం ఎంపిక చేయలేదు. అంతేకాకుండా రాజధానిని ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని భావించడంతో స్వాతంత్ర్య వేడుకలను జిల్లాల్లోనే నిర్వహించాలని భావించింది. అయితే ప్రస్తుతం రాజధాని ప్రకటించి పదేళ్లు దాటడం, రాజధాని ప్రాంతంలో కొంత ప్రాంతం స్వాతంత్ర్య సంబరాలు నిర్వహణకు అనువుగా ఉండటం ఈ ఏడాది సంబరాలను విజయవాడలో కాకుండా అమరావతిలోనే నిర్వహించాలని భావించారు.
రాష్ట్ర సచివాలయం వెనుక వైపు గతంలో పీ4 బహిరంగ సభ నిర్వహించిన మైదానంలో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి పలు ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది అమరావతిలో వేడుకలు నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు లేకపోయినా, చివరి నిమిషంలో అమరావతిలో కాకుండా విజయవాడలో సంబరాలు నిర్వహించేలా వాయిదా వేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఈ సారి ప్రకృతి అడ్డు పడటమే అంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమరావతిలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించాల్సిన ప్రదేశం చిత్తడిగా మారిపోయింది. ఫలితంగా ఈ ఏడాది కూడా అమరావతిలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించడం కుదరలేదని చెబుతున్నారు.
వాస్తవానికి ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య వేడుకలు అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాజధానిలో ప్రభుత్వ భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. రాష్ట్ర సచివాలయాన్ని అందంగా అలంకరించింది. కానీ వరుణుడు ధాటికి భారీ వర్షాలు కురవడంతో అమరావతి ప్రాంతం చిత్తడిగా మారిపోయింది. రాజధాని మొత్తం పూర్తిగా సాగుభూములు కావడం వల్ల ఏ మాత్రం వర్షం కురిసిన నేల చిత్తడిగా మారుతుంది. అయితే ఈ పరిస్థితిని ఊహించకపోవడం వల్ల ముందు అమరావతిలో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. వర్షాల కారణంగా చివరి నిమిషంలో వేదిక మార్చి విజయవాడలో సంబరాలు ఘనంగా నిర్వహించింది.
