లక్షల్లో నిరక్షరాస్యులు...లోకేష్ షాక్
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన సమీక్షలో ఏపీలో నిరక్షరాస్యులు ఎంతమందో వెల్లడింది.
By: Tupaki Desk | 7 Jun 2025 2:00 AM ISTఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన సమీక్షలో ఏపీలో నిరక్షరాస్యులు ఎంతమందో వెల్లడింది. దీంతో అధికారులతో సహా అంతా ఆశ్చర్యపోవడం జరిగింది. ఏపీలో మొత్తం 81 లక్షల మందికి పైగా నిరక్షరాస్యులు ఉన్నారని విషయం బయటపడడంతో సంచలనమైంది.
వీరంతా 15 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మధ్య వయస్కులుగా ఉన్నారు. దీంతో మంత్రి లోకేష్ ఈ డేటాను చూసి విస్మయం చెందారు. ఏపీ జనాభా అయిదు కోట్లు అయితే ఒక కోటికి దగ్గరగా నిరక్షరాస్యులు ఉన్నారన్న మాట. అంటే ఇరవై శాతంగా ఈ సంఖ్య ఉంది.
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఇన్ని లక్షలలో చదువుకోని వారు ఉండడం అంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకుని రావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు.
ఏపీలో వయోజన విద్యా మిషన్ ని తక్షణం ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందరికీ విద్య అవసరమని అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఉల్లాస్ పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నాయి. ఉల్లాస్ అంటే అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇని సొసైటీ గా పేర్కొంటారు.
అంటే ఏ వయసులో వారైనా జీవితకాలంలో విద్య నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఉల్లాస్ చాటి చెబుతుంది. ఈ పధకానికి 15 ఏళ్ళు పై దాటిన వారు బడులను మధ్యలోనే వదిలేసిన వారు, విద్య మీద ఆసక్తి లేని వారు ఇలా అందరికీ గ్రామ స్థాయిలోనే గుర్తిస్తారు. వీరికి విద్యా బోధల చేయడానికి వాలంటీర్లను ప్రత్యేకంగా నియమిస్తారు.
ఈ వయోజనులకు ప్రతీ రోజూ సాయంత్రం రెండు గంటల పాటు అంటే సాయంత్రం అయిదు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ సచివాలయాలు అంగన్ వాడీ కేంద్రాలు సామాజిక భవనాల వద్ద వయోజన విద్యను బోధిస్తారు. ఇక వీరి కోసం ప్రత్యేక పుస్తకాలు ఉంటాయి. వీరికి వీడియోల ద్వారా కూడా విద్యా బోధన జరుగుతుంది. రాయడం చదవడం వంటివి నేర్పిస్తారు.
ఇపుడు వీటికి అదనంగా ఏపీలో వయోజన విద్యా మిషన్ ని ప్రారంభించబోతున్నారు. రానున్న కాలంలో లక్షలలో ఉన్న నిరక్షరాస్యుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ అన్ని రంగాలలో అగ్రగామి కావాలని ఏఐ లో దూసుకుపోవాలని ఆలోచిస్తున్న క్రమంలో ఇంత పెద్ద ఎత్తున నిరక్షరాస్యులు ఉండడం మాత్రం ఏ విధంగానూ మంచిది కాదనే మేధావులు అంటున్నారు.
