మధ్యతరగతి 'కలలకు' కూటమి రెక్కలు.. !
పేదలు, మధ్యతరగతి జీవితాల్లో కూటమి సమూల మార్పులు తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
By: Tupaki Desk | 27 Jun 2025 8:36 AMపేదలు, మధ్యతరగతి జీవితాల్లో కూటమి సమూల మార్పులు తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మధ్యతరగతి, పేద ప్రజలు కలలు గనే.. ఇంటి నిర్మాణాల విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చిన్న ఇంటిని నిర్మించుకోవాలంటే.. అనేక ఆపశోపాలు పడాల్సి వచ్చేది. అనుమతుల నుంచి మెటీరియల్ వరకు కూడా ఇబ్బందులు తప్పేవి కాదు. కానీ, కూటమి వచ్చిన తొలి ఏడాదే.. ఈ విషయంపై లోతైన కసరత్తు చేసింది. తద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలు తమ కలలను సునాయాసంగా సాకారం చేసుకునేలా నిర్ణయం తీసుకుంది.
అనుమతులు: ఇంటి నిర్మాణం చేపట్టాలంటే..స్థానిక ప్రభుత్వాలు.. లేదా అధికారుల నుంచి అనుమతు లు తప్పకుండా తీసుకోవాలి. దీనికి సంబంధించి కొన్ని ఫీజులు కూడా చెల్లించాలి. ఈ క్రమంలో పేదలు, మధ్యతరగతి వర్గాలు.. వేలాది రూపాయలను ఫీజులుగా సర్కారుకు చెల్లించడం తెలిసిందే. దీనివల్ల వారిపై అదనపు భారం పడుతోంది. ఈ విషయంపై దృష్టిపెట్టిన కూటమి.. మధ్యతరగతి, పేదలకు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు రూపాయికే ఇక అనుమతులు ఇవ్వనున్నారు. 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాల్లో బాల్కనీలు గరిష్ఠంగా 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకు నే అవకాశం కొత్తగా కల్పించింది. ఇక, మధ్యతరగతి ఎక్కువగా నిర్మించుకునే 100 చదరపు మీటర్ల (ప్లాట్) స్థలంలో నిర్మాణాలకు కూడా రూ.200 లలోపు ఫీజులనే నిర్ణయించనున్నారు. అంతేకాదు.. తడి, పొడి వ్యర్థాల నిర్వహణ ప్రతి భవనంలోనూ తప్పనిసరి చేయడంద్వారా ఈ భారం కూడా తప్పించనున్నారు.
మెటీరియల్: భవన నిర్మాణాలకు మెటీరియల్ ముఖ్యం. దీనిలోనూ ఇసుక చాలా చాలా ముఖ్యం. ఇది లేకపోతే.. పనులే లేవు. సో.. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. దీనిలో మరింత పారదర్శకత కోసం.. ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై.. క్షేత్రస్థాయికి దీనిని మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాల సొంత ఇంటి కలలను సాకారం చేయనుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పన్నుల విధానంలో ఎలాంటి మార్పు చేయకుండా భారాలు వేయకుండా కూడా చర్యలు తీసుకుంటోంది.