Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా కేసులు... బెయిలు చాలా కష్టం గురూ..!

సోషల్ మీడియా కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే ముందు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ సూచించారు.

By:  Tupaki Desk   |   6 July 2025 8:00 PM IST
సోషల్ మీడియా కేసులు... బెయిలు చాలా కష్టం గురూ..!
X

సోషల్ మీడియా కేసులపై చాలా కఠినంగా వ్యవహరించాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మేజిస్ట్రేట్లు నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో విద్వేష, అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్న ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు మరింత కలిసొచ్చినట్లేనని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సినీ నటుడు పోసాని కృష్ణమురళితోపాటు వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పాలేటి కృష్ణవేణితో పాటు చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళను అరెస్టు చేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన సజ్జల భార్గవరెడ్డిపై కేసులు నమోదు చేయడంతోపాటు జగన్ సతీమణి భారతిరెడ్డికి పీఏగా పనిచేసిన వర్రా రవీంద్ర రెడ్డి వంటివారిని అరెస్టు చేశారు. అదే సమయంలో భారతీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ ను సైతం అరెస్టు చేయించింది.

అయితే సోషల్ మీడియా కేసులపై ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. విద్వేష, అనుచిత పోస్టులు పెడుతున్నవారిలో వైసీపీ కార్యకర్తలు అయితే ఒకలా, టీడీపీ వారైతే మరోలా చర్యలు తీసుకొంటున్నారని విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. కానీ, ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న రీతిలో కేసులతో ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వైసీపీ సానుభూతిపరురాలు శ్రీ రెడ్డి వంటి వారిని క్షమించి వదిలేసినా, చాలా మందిని మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపింది. అయితే సోషల్ మీడియాను అదుపు చేసే యంత్రాంగం లేకపోవడంతో అనుచిత పోస్టులు యథావిధిగా వస్తూనే ఉన్నాయి.

సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో సోషల్ మీడియా బాధితులుగా మారిపోవడం, కొన్నిసార్లు బాధితులు మనస్తాపానికి లోనై తీవ్ర చర్యలు తీసుకుంటుండటంతో సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై సోషల్ మీడియా కేసుల విచారణలో కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు అన్నికోర్టులు ఈ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. దీంతో ఏపీ హైకోర్టు నుంచి దిగువ స్థాయిలో మేజిస్ట్రేట్, జిల్లా న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తెలియజేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇకపై సోషల్ మీడియా కేసుల విచారణలో మేజిస్ట్రేట్లు సుప్రీం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు.

సోషల్ మీడియా కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే ముందు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పట్టించుకోకుండా మేజిస్ట్రేట్లు తీర్పులు వెలువరిస్తున్నారని కోర్టు దృష్టికి వచ్చిందని హైకోర్టు వెల్లడించింది. ప్రసంగం, రచన, కళాత్మక వ్యక్తీకరణకు సంబంధించి అందిన ఫిర్యాదుల్లో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు బీఎన్ఎస్ సెక్షన్ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని స్పష్టం చేసింది. అదేవిధంగా మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపే ముందు సంబంధిత డీఎస్పీ అనుమతి తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా 14 రోజుల్లోనే ఈ విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.

నిందితులు నేరాన్ని పదేపదే చేస్తున్నారా? సాక్ష్యులను ప్రభావితం చేస్తారా? ఆధారాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయా? కస్టోడియల్ విచారణ అవసరమా? తదితర అంశాలపై న్యాయమూర్తులు సంతృప్తి చెందిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సర్క్యులరులో పేర్కొంది. ఈ అంశాలను మేజిస్ట్రేట్లు పక్కాగా అనుసరించాలని, కేసుల విచారణలో ఉల్లంఘన జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా కోర్టు ధిక్కారణ కింద చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.