పరకామణి చోరీ చిన్న నేరమా?:హైకోర్టు సంచలన వ్యాఖ్య
ఈ నేపథ్యంలో పరకామణి కేసుకు సంబంధించి తాజాగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Political Desk | 17 Dec 2025 3:40 PM ISTరెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన తిరుమల పరకామణిలో శ్రీ హుండీవారి లెక్కింపు సందర్భంగా జరిగిన చోరీ చాలా పెద్ద నేరమని... దీన్ని చిన్న దొంగతనం ఘటనగా చూడరాదని...భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘటనగానే పరిగణించాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
గత వైఎస్సార్ సీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనమే కాదు తిరుమల భక్తులపై తీవ్ర ప్రభావం కూడా చూపించింది. చోరీ మొత్తం విలువ రూ.70 వేలు. అయితే.. ఈ కేసులో రాజీ చేసుకోవడం.. ఫిర్యాదు చేసిన అప్పటి టీటీడీ భద్రతా సిబ్బంది.. సీఐ. సతీష్ కుమార్.. అనుమానాస్పద రీతిలో మరణించడంతో కేసు మరింతి సంచలనంగా మారింది.
2023 ఏప్రిల్ 29న పెద్ద జీయర్ మఠం క్లర్క్ గా ఉన్న సి.వి.రవికుమార్ తిరుమల పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. ఆయన తన లోదుస్తుల్లో 900 అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ. 70వేలు దొంగలించినట్లు ఆరోపిస్తున్నారు. అయితే రవికుమార్ దొంగతనం వెనుక కొందరు టీటీడీ , విజిలెన్స్ అధికారుల హస్తం ఉన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టిటిడి చరిత్రలో ఇది అత్యంత భారీ దొంగతనం అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పరకామణి కేసుకు సంబంధించి తాజాగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణిలో చోరీని కేవలం దొంగతనంగా చూడరాదు. ఇది చాలా పెద్ద నేరం, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, శ్రీవారి ఆలయ నగదు భద్రతకు సంబంధించిన అంశమని పేర్కొంది. పరకామణి చోరీ ఘటనను తేలిగ్గా తీసుకుంటే.. భక్తుల విశ్వాసానికి గండి కొట్టినట్లే అని వ్యాఖ్యానించింది. కోర్టు లైట్‌గా తీసుకునేందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా విచారించాల్సిందిగా సీఐడీ అధికారులకు కోర్టు తెలిపింది. పరకామణి కానుకల లెక్కింపు వ్యవహారంపై ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని వివరించాలని టీటీడీని ఆదేశించింది. లెక్కింపు వ్యవహారాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని కూడా కోర్టు ఆదేశించింది. పరకామణికి సంబంధించి ప్రతి అంశానికి టీటీడీ బాధ్యత వహించాల్సి తీరాల్సిందేనని స్పష్టీకరించింది.
మరోవైపు శ్రీవారి సొమ్మును దోచుకుంటూ దొరికిపోయిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా రాజీ కుదుర్చుకోవడం ఏంటని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు రవికుమార్ వెనుక గత ప్రభుత్వ పెద్దలున్నారని భావిస్తున్న ప్రభుత్వం..సిట్ విచారణతో వారి అవ్యవహారాన్ని బైటికి లాగుతామని అంటోంది. కాగా వైసీపీ నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు పరకామణిలో చోరీని బయటపెట్టి.. రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామని చెబుతున్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలాగానే.. పరకామణి వ్యవహారం కూడా జటిల సమస్యగా మారింది. దీనిపై అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరకామణి చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి లోకేష్. ప్రకటించగా...వైసీపీ సిట్‌తో కాదు సీబీఐను రంగంలోకి దించాలన్న డిమాండ్ ను తెరపైకి తెస్తోంది.
పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు తాజా వ్యాఖ్యలతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ విషయంగా అధికార కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్య ఆసక్తికరంగా మారుతోంది.
