Begin typing your search above and press return to search.

హెరిటేజ్ ఇష్యూ.. టీడీపీ మంత్రులే అధికారుల ప్రతినిధులు!!

ఇందాపూర్ డెయిరీ కోసమే టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టును మార్చారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అన్న చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   22 Feb 2026 1:24 PM IST
హెరిటేజ్ ఇష్యూ.. టీడీపీ మంత్రులే అధికారుల ప్రతినిధులు!!
X

ఏపీ రాజకీయాలు ‘హెరిటేజ్ ఫుడ్స్’ చుట్టూ తిరుగుతున్నాయి. తిరుమల లడ్డీ కల్తీ ఆరోపణల నుంచి బయటపడేందుకు వైసీపీ ప్రయోగించిన ‘హెరిటేజ్’ బాణం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హెరిటేజ్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఇందాపూర్ డెయిరీ కోసమే లడ్డూ కల్తీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఇందాపూర్ డెయిరీ ద్వారా హెరిటేజ్ ప్రయోజనం పొందుతోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విమర్శలను హెరిటేజ్ ఖండించింది. అంతేకాకుండా ఇందాపూర్ డెయిరీకి తమకు ఏ సంబంధం లేదని, వైసీపీ ఆరోపణలు సత్యదూరమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇలా వైసీపీ వర్సెస్ హెరిటేజ్ మధ్య కొనసాగుతున్న వివాదంలో టీడీపీ మంత్రులు ఆ సంస్థను వెనకేసుకు రావడంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వైసీపీ చేస్తు్న ఆరోపణలపై హెరిటేజ్ ఫుడ్స్ న్యాయపోరాటం చేస్తోంది. అయితే హెరిటేజ్ కు మించి టీడీపీ మంత్రులు వైసీపీ ఆరోపణలపై ఎదురుదాడి చేయడం చర్చనీయాంశం అవుతోంది. హెరిటేజ్ అధికార ప్రతినిధులుగా మంత్రులు వ్యవహరిస్తున్నారంటూ విపక్షం ఆరోపిస్తోంది. మండలిలో చర్చ సందర్భంగా ప్రభుత్వం సమాధానం చెబుతుందని, కానీ హెరిటేజ్ అంతర్గత వ్యవహారాలపై మంత్రులు మాట్లాడమేంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇందాపూర్ డెయిరీ కోసమే టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టును మార్చారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అన్న చర్చ జరుగుతోంది. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ చీజ్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేస్తున్నారని, ఆ నెయ్యినే టీటీడీకి సరఫరా చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిని హెరిటేజ్ తీవ్రంగా ఖండించింది. ఆధారాలు చూపమంటూ లాయర్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతలు న్యాయస్థానం ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సివుంటుంది. ఇక్కడితో వైసీపీ వర్సెస్ హెరిటేజ్ వివాదం ముగిసిపోయినట్లుగా భావిస్తున్నారు.

కానీ, టీడీపీ మంత్రులు మాత్రం వెనక్కి తగ్గడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. హోంమంత్రి అనిత, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీకి చెందిన పలువురు మంత్రులు హెరిటేజ్ కు ఇందాపూర్ డెయిరీతో సంబంధం లేదని చెబుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో ఆ పార్టీ నేతలు స్పందిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ, ప్రభుత్వంలో భాగమైన మంత్రులు ఒక ప్రైవేటు సంస్థను వెనకేసుకు వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి హెరిటేజ్ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. కల్తీ నెయ్యి విషయంలో డిఫెన్స్ లో పడిపోయిన వైసీపీ.. కౌంటర్ అటాక్ తో టీడీపీ కూటమిని టార్గెట్ చేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో హెరిటేజ్ న్యాయపోరాటంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాల్సివుంది. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ లీగల్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ బొత్స తన ఆరోపణల నుంచి వెనక్కి తగ్గడం లేదని చెబుతున్నారు. అయితే ఇక్కడ టీడీపీ మంత్రులు సైతం అదేస్థాయిలో ఎదురుదాడి చేయడం, మంత్రులకు హెరిటేజ్ కు ఏం సంబంధం అన్న వైసీపీ ప్రశ్నలకు సమాధానం ఏం చెబుతారన్నది ఆసక్తికర చర్చగా మారిందని అంటున్నారు.