విద్యుత్ స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయ్ !
ఏపీలో ప్రతీ ఇంటికీ ప్రీ పెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు రంగం సిద్ధం అయింది.
By: Tupaki Desk | 3 Jun 2025 3:43 AMఏపీలో ప్రతీ ఇంటికీ ప్రీ పెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు రంగం సిద్ధం అయింది. ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే పచ్చ జెండా ఊపేసింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాంతో దశల వారీగా ఏపీలో ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇక తొలి దశలో ఏకంగా నలభై లక్షల ఇళ్ళకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని నిర్ణయించారు. అలా దశలవారీగా చూసుకుంటూ ఏపీ మొత్తంగా రెండు కోట్ల ఇళ్ళకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేయడంతో తొలి దశ బిగింపులకు రంగం సిద్ధం అయిపోయింది.
అలా మొదటి దశలో ఉమ్మడి కృష్ణా ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలు పట్టణాలలో దాదాపుగా పదకొండు లక్షల ఇళ్ళకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అంతా సిద్ధం చేశారు. అంతే కాదు ఇంటితో పాటు వ్యాపార సంస్థలకు సైతం స్మార్ట్ మీటర్లను బిగించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ స్మార్ట్ మీటర్ల బిగింపును వామపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పేదలు మధ్యతరగతి వర్గాలకు ఈ విధానం పెను భారం అవుతుందని ఆరోపిస్తున్నాయి.
ప్రీపెయిడ్ అంటే ముందుగానే సొమ్ము చెల్లించాలని అలా చేసే ఆర్ధిక స్తోమత ఎంతమందికి ఉంటుందని ప్రశ్నిస్తున్నాయి. ఒక పల్లెలలో ఉన్న వారు ప్రీపెయిడ్ చేసుకునే అవగాహన లేకపోతే ఏ సమయంలో అయినా కరెంట్ పోతుందని అపుడు వారు అంధకారంలోనే మగ్గుతారని కూడా అంటున్నారు.
పైపెచ్చు స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక చార్జీలు వసూల్ చేస్తారని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలలో అధిక విద్యుత్ వాడకం ఉండే సమయాలలో ప్రత్యేక రేట్లు పెడతారని ఆ విధంగా స్మార్ట్ మీటర్లతో దోపిడీయే అని అంటున్నారు అంతే కాదు స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్ బిగించడానికి పదమూడు వేల రూపాయలు అవుతుందని దానిని ప్రతీ నెలా బిల్లులోనే వసూలు చేస్తారని అది మరో అదనపు భారం అని అంటున్నారు.
ఇక స్మార్ట్ మీటర్లతో ఏపీ వ్యాప్తంగా ప్రజల నుంచి ముందుగానే ఏకంగా పాతిక వేల కోట్ల రూపాయలు అందుకోవడానికి వేస్తున్న పధకం అని కూడా విమర్శిస్తున్నారు. ఎన్నో లొసుగులు సందేహాలు ఉన్న ఈ విధానాన్ని టీడీపీ ఆనాడు విపక్షంలో ఉన్నపుడు వ్యతిరేకించి అధికారంలో ఉన్నపుడు తామే అమలు చేయడమేంటి అని కామ్రేడ్స్ ప్రశ్నిస్తున్నాయి. దీని మీద తాము ఉద్యమిస్తామని చెబుతున్నాయి.
అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం వల్ల స్మార్ట్ మీటర్ల బిగింపు అన్నది ఏపీలో స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. మరి దీని మీద వచ్చే మంచి చెడులు ఏమిటన్నది జనాలకు అనుభవంలోనే తెలుస్తుంది అని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలేమో ఇది మంచి కార్యక్రమమని నాణ్యమైన నిరాటంకమైన విద్యుత్ ని సరఫరా చేయడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.