ఏడాదిలో అసంతృప్తి.. 'సిక్స్' సమస్యలు ఇవే!
ముఖ్యంగా 6 అంశాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని సరిచేసుకుంటే.. కూటమి ప్రభుత్వానికి తిరుగు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 21 Jun 2025 6:30 PMఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. అయితే.. ఏడాది పాలనలోనే ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేయడం సరికాకపోయినా.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. ప్రతిపక్షం గత ఎన్నికల్లో తెచ్చుకున్న 40 శాతం ఓటు బ్యాంకు నేపథ్యంలో తాజాగా ప్రజలు ఏమనుకుంటున్నారన్నది ఆసక్తిగా మారింది. 51 శాతం మంది ప్రజలు పాలన బాగుందన్న కితాబు ఇచ్చినా.. 49 శాతం మంది మాత్రం అసంతృప్తికి గురయ్యారు. ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. ముఖ్యంగా 6 అంశాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని సరిచేసుకుంటే.. కూటమి ప్రభుత్వానికి తిరుగు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏంటవి.. ఏం చేయాలి?
1) అమరావతిపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం: రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. రాయల సీమ, ఉత్తరాంధ్ర, కోస్తా. ఈ మూడు ప్రాంతాలను కూడా కూటమి సర్కారు సమానంగా డెవలప్ చేయాల్సి ఉంది. అయితే.. అమరావతిపైనేఎక్కువగా దృష్టి పెడుతున్నారన్న వాదన ప్రజల్లో పెరుగుతోంది. అలా కాకుండా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
2) కేసులు: ప్రత్యర్థి పక్షం వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు కూడా ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. గతంలో వైసీపీ టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయడాన్ని తిరస్కరించినట్టే ప్రజలు ఇప్పుడు కూడా వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతున్నారు. కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారా? అనే కోణంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిని సరిచేసుకోవడం పెద్ద ఇబ్బంది కాదు.
3) అన్నదాతలకు అసంతృప్తి: గిట్టుబాటు ధరలు లభించకపోగా.. తమకు ఇస్తామన్న పథకాలను ఇప్పటికీ అమలు చేయకపో వడంపై అన్నదాతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విషయం ఆర్థికంగా ముడి పడి ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేస్తే.. రైతుల్లో అసంతృప్తిని తగ్గించే అవకాశం ఉంటుంది.
4) రేషన్: వైసీపీ హయాంలో రేషన్ వాహనాల ద్వారా(ఎన్ ఎండీ) ఇంటింటికీ రేషన్ పంపిణీ చేశారు. అయితే.. ఇటీవల కూటమి సర్కారు ఈ వాహనాలను ఆపేసి.. రేషన్ దుకాణాలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పల్లెలు, గిరిజన, మారు మూల ప్రాంతాలకు చెందినవారు ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో అసంతృప్తి ఉంది.
5) ఎమ్మెల్యేల పనితీరు: కూటమి పార్టీల్లోని 64 శాతం మంది ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరీ ముఖ్యంగా వీరిలో 42 శాతం మంది పై అక్రమాలు, వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సర్కారు మెడకు చుట్టుకుంటోంది. చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా.. నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదు.
6) చార్జీల బాదుడు: విద్యుత్ బిల్లుల బాదుడు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. వైసీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే.. బిల్లుల బాదుడు తగ్గిస్తానని చెప్పారు. కానీ, అది నెరవేరడం లేదు. దీనిపైనా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపై ఎంత త్వరగా నిర్ణయం తీసుకుని ప్రజలకు ఉపశమనం కల్పిస్తే.. సర్కారుకు అంత మంచిదని అంటున్నారు పరిశీలకులు.