జగన్ ను మించిపోయిన చంద్రబాబు, పవన్, లోకేశ్.. ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్
ప్రజాధనం ఖర్చు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రస్తుత ప్రభుత్వం మించిపోయిందనే విమర్శలపై ప్రభుత్వం స్పందించింది.
By: Tupaki Desk | 24 May 2025 3:54 PM ISTప్రజాధనం ఖర్చు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రస్తుత ప్రభుత్వం మించిపోయిందనే విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి లోకేశ్ పర్యటనలకు విచ్చలవిడిగా హెలీకాప్టర్లు వినిగిస్తున్నారని, గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రిగా జగన్ హెలికాఫ్టర్ వాడితే విమర్శలు చేసేవారు ఇప్పుడు అంతకుమించి ఖర్చు చేస్తున్నారని వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా ఆరోపిస్తోంది. దీంతో ప్రభుత్వం అసలు నిజాలివి అంటూ లెక్కలు బయటపెట్టింది.
ప్రతిపక్షం వైసీపీ అంటే లెక్కలేనట్లు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తొలిసారిగా వైసీపీ విమర్శలకు ఆత్మరక్షణలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిగా వైసీపీ ఏ విమర్శ చేసినా పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరించిన ప్రభుత్వం.. తాజాగా ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారానికి ఫ్యాక్ట్ చెక్ ఇదిగో అంటూ వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. హెలికాఫ్టర్ల వినియోగంలో కూటమి ప్రభుత్వంలోని ముగ్గురు నేతలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
గతంలో ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్లినా హెలికాఫ్టర్ వినియోగించేవారు. చివరికి ఆయన నివాసానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు, తెనాలి వంటి చోటుకు వెళ్లినా హెలికాఫ్టర్ వినియోగంపై టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేసేది. అప్పటి విమర్శలు దృష్టిలో పెట్టుకుని తాజాగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. ఏడాది కాలంలోనే రూ.54 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపిస్తోంది. దీంతో ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం హెలికాఫ్టర్ల నిర్వహణకు ఏవియేషన్ కార్పొరేషన్ కు ఏటా రూ50 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. గత ప్రభుత్వంలో కూడా ఇంతే మొత్తం ఖర్చుచేశారు. ఎప్పుడూ ఇదే విధానం అమలు చేస్తున్నాం, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టిందనే ఆరోపణల్లో నిజం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీం దీనిపై ట్వీట్ చేసింది.
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెలికాప్టర్ ల నిర్వహణ కోసం రూ.54 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియే. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం, నిర్వహణ కోసం, ఏవియేషన్ కార్పోరేషన్ కి ప్రతి ఏడాది రూ.50 కోట్లకు పైగా కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తుంది. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా రూ.55 కోట్లు ఒక ఏడాదిలో, మరో ఏడాదిలో రూ.52 కోట్లు అనేది కేటాయించి, ప్రతి క్వార్టర్ కి నిధులు విడుదల చేసారు. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే సహజ ప్రక్రియ. వాస్తవాలు ఇలా ఉంటే, కేవలం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి లోకేష్ గారు మాత్రమే అధికంగా ఖర్చు చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం.’’ అంటూ స్పష్టం చేసింది.
