నాణ్యమైన రేషన్ బియ్యం...కూటమి కానుక
ఈ విషయంలో త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
By: Satya P | 9 Jun 2026 9:47 AM ISTఏపీలో ఉన్న చౌక దుకాణాలలో తొందరలోనే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటిదాకా అందిస్తున్న బియ్యాన్ని ప్రజలు పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. దుడ్డు బియ్యం కారణంగా వాటిని రేషన్ దుకాణాల వద్దనే అమ్ముకుంటున్నారు అనంది బహిరంగ రహస్యమే. అందుకే కూటమి ప్రభుత్వం ప్రజలు కోరుకునే విధంగా నాణ్యమైన బియ్యాన్ని అందించాలని చూస్తోంది. దాంతో ప్రజలు తప్పకుండా రేషన్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటారు అని ప్రభుత్వం ఈ విషయంలో తీసుకుంటున్న చొరవను అభినందిస్తారని భావిస్తోంది.
విధానపరమైన నిర్ణయం :
ఈ విషయంలో త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. భవిష్యత్తులో రేషన్ డిపోల ద్వారా లబ్దిదారులకు అందించే బియ్యం నాణ్యమైనవి అందించాలని భావిస్తున్నామని ఆయన తాజాగా ప్రకటించారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ప్రణాళికను ఇప్పటికే కేంద్రం ముందు పెట్టామని ఆయన వెల్లడించారు. అక్కడి నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని కూడా చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఆపాలంటే ప్రజలు రేషన్ బియ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రజలు రేషన్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచంగా చెప్పారు.
అక్రమ రవాణాపై కొరడా:
అదే విధంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడానికి ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ లను వినియోగిస్తామని కూడా మంత్రి తెలిపారు. అలాగే రేషన్ దుకాణాలతో పాటుగా ప్రత్యేకంగా హోల్ సేల్ దుకాణాల స్థాయిలో మినీ మార్టులను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. ఆయా మినీ మార్టుల ద్వారా మంచి డిస్కౌంట్ తో బియ్యం, చిరుధాన్యాలు, తృణధాన్యాలు ప్రజలకు లభించే ఏర్పాటు చేస్తామని అన్నారు. అదే విధంగా రానున్న రోజులలో గుజరాత్, పాండిచ్చేరిలో విజయవంతంగా అమలు అవుతున్న సీబీడీసీ విధానాన్ని కూడా ఏపీలో అమలు చేస్తామని అన్నారు. దీనివల్ల డిజిటల్ రూపాయి సాయంతో వినియోగదారులు తమకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలుంటుందని అన్నారు. ఈ విధంగా అటు రేషన్ దుకాణాల లబ్దిదారులకు మరో వైపు రైతులకు పౌర సరఫరాల ద్వారా మేలైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల చెబుతున్నారు. మరి రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం అందించడం అంటే జనాలకు ముఖ్యంగా పేదలకు మేలు చేసినట్లే అని అంతా అంటున్నారు.
