ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రచార వ్యూహం.. కూటమి ప్రభుత్వ సంచలన నిర్ణయం
కూటమి ప్రభుత్వం ప్రచార వ్యూహంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సంప్రదాయ ప్రచార వ్యూహాన్ని పక్కన పెట్టి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రచారం కోసం వాడుకోవాలని ప్రభుత్వం గుర్తించింది.
By: Tupaki Desk | 23 Sept 2026 11:00 PM ISTకూటమి ప్రభుత్వం ప్రచార వ్యూహంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సంప్రదాయ ప్రచార వ్యూహాన్ని పక్కన పెట్టి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రచారం కోసం వాడుకోవాలని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇకపై ప్రభుత్వ ప్రకటనలకు ఇన్‌ఫ్లూయెన్సర్లను నియమించనున్నారని చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీర్మానం ఆమోదించినట్లు ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ముందుగా గుర్తించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గుర్తింపు పొందిన (ఎంపానెల్మెంట్) ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఐడీ కార్డులు జారీతోపాటు ప్రచార కార్యక్రమాలకు పారితోషకం చెల్లించనున్నట్లు చెబుతున్నారు.
దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా తన కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను వాడుకోవాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఏడాది కాలంగా ఈ విషయమై ప్రభుత్వం విస్తృత కసరత్తు చేసిందని, ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎటువంటి విధానాలను పాటిస్తున్నారనేది అధ్యయనం చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేబినెట్ ఆమోదంతో పత్రికలు, టీవీ చానళ్ల మాదిరిగానే భవిష్యత్తులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల కూడా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనున్నారని చెబుతున్నారు.
సాధారణ పరిపాలన శాఖ పరిధిలోని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ లోని కంటెంట్ క్రియేటర్లకు ముందుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకువచ్చే యాప్ లో ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లు నమోదు చేసుకుని, వారికి ఉన్న ఫాలోవర్లు ఆధారంగా పారితోషకం చెల్లించనున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం గరిష్టంగా 5 వేల రూపాయల వరకు చెల్లించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కనీసం పది వేల మంది ఫాలోవర్లు ఉన్నవారినే ఎంపానల్ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక ఏడాది సమయానికి ఈ గుర్తింపు ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు.
రీల్స్ కాలంలో సరికొత్త నిర్ణయం
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రచారానికి వాడుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ గడుపుతుండటంతో ప్రభుత్వ ప్రచారానికి తప్పనిసరిగా రీల్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. గతంలో పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కలిగించేవారని అంటున్నారు. అయితే ఇప్పుడు వాటిని మించిపోయే విధంగా సోషల్ మీడియా రీల్స్ కు రీచ్ ఉంటోందని అంటున్నారు.
దీంతో ప్రభుత్వం కూడా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సివచ్చిందని అంటున్నారు. ఇటీవల దేశంలో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలలో సైతం రీల్స్ ద్వారా ఓటర్లు ప్రభావితమైనట్లు ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నారు. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ పార్టీ ఆందోళనలకు ఇన్‌ఫ్లూయెన్సర్లే కారణమని, ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రజలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున ప్రభుత్వం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అటు ప్రధాని మోదీ సైతం తన మంత్రివర్గ సహచరులకు రీల్స్ చేయాలని గతంలో ఉద్బోధించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేసిందని అంటున్నారు.
