ఏపీలో మొదలైన ఇన్‌ఫ్లుయెన్సర్స్ హవా.. రాజమండ్రిలో పర్యాటక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తొలి అడుగు వేసింది.
By: Tupaki Desk | 26 Sept 2026 10:37 PM ISTసోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ తీసుకువచ్చిన రెండు రోజులకే రాజమండ్రి కేంద్రంగా రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో "డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీ డిజైన్ టూరిజం" గ్లోబల్ థీమ్ ఆధారంగా సదస్సు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకలకు పర్యాటక రంగానికి చెందిన ప్రముఖులు, టూర్ ఆపరేటర్లు, ఆతిథ్య రంగ ప్రతినిధులతోపాటు కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ హాజరుకానున్నారని మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా వెల్లడించారు.
పర్యాటక ప్రచారం, పర్యాటక గమ్యస్థానాల మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, డిజిటల్, ఏఐ ఆధారిత పర్యాటక పరిష్కారాలపై రాజమండ్రి సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. సోషల్ మీడియా ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్రియేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్రీచ్ కార్యక్రమాలను చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. గోదావరి ప్రాంతంలో క్యూరేటెడ్ ఫామిలియరైజేషన్ ట్రిప్స్ కోసం సెప్టెంబర్ 26న విశాఖపట్నం నుండి హాఫ్-ఆన్ హాఫ్-ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను రాజమండ్రికి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతంలోని విభిన్న పర్యాటక విశేషాలను అనుభవించి డాక్యుమెంట్ చేసి సోషల్ మీడియా వేదికగా ఏపీ పర్యాటక ప్రాంతాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కంటెంట్ క్రియేటర్లకు, ఫోటోగ్రాఫర్లకు,స్టోరీ టెల్లర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు అద్భుతమైన అవకాశమని మంత్రి దుర్గేష్ తెలిపారు.
ఇక గోదావరి పుష్కరాలు 2027కి సన్నాహకంగా "ది గోదావరి కాల్స్" అనే ఫ్లాగ్ షిప్ పర్యాటక ప్రచార కార్యక్రమానికి ఈ వేడుకల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గోదావరి ప్రాంత సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి సౌందర్యాన్ని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రాష్ట్ర స్థాయి వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గొప్ప కళా వైభవాన్ని చాటేలా సాంస్కృతిక ప్రదర్శనలు, ఆంధ్రప్రదేశ్ టూరిజం అవార్డ్స్ 2026 ప్రదానోత్సవం జరగనున్నాయని, అలాగే పర్యాటక అనుభవాలను మెరుగుపరచడానికి కీలకమైన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలు అన్నింటికి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
సాంకేతిక భాగస్వామ్యం
ఏఐ-ఎనేబుల్డ్ టూరిజంలో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఎక్స్ ప్లర్జర్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130కి పైగా పర్యాటక ప్రాంతాలలో 'నివు' ఏఐ-ఎనేబుల్డ్ క్యూర్ కోడ్‌లను ప్రవేశపెడుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. కేవలం ఒక స్కాన్ ద్వారా పర్యాటకులు 130కి పైగా భాషల్లో మాట్లాడగల ఇంటెలిజెంట్ డిజిటల్ గైడ్‌తో నేరుగా సంభాషించవచ్చని వివరించారు. తద్వారా పర్యాటకులకు పర్యాటక ప్రాంతాల సమాచారం మరింత సులభంగా, ఆకట్టుకునేలా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో భాగంగా ఏఐ సాంకేతికతతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు.
