Begin typing your search above and press return to search.

ఇల్లు లేని పేదలకు కూటమి గుడ్ న్యూస్

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న లే అవుట్లలో నిర్మాణాలు చేపట్టని భూమిని అవసరానికి అనుగుణంగా రెండు లేదా మూడు సెంట్ల ప్లాట్లుగా పునర్వ్యవస్థీకరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

By:  Satya P   |   15 Sept 2026 10:00 PM IST
ఇల్లు లేని పేదలకు కూటమి గుడ్ న్యూస్
X

ఏపీలో ఇల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం శుభ వార్తను వినిపిస్తోంది. ఉచితంగా వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. దీని కోసం ఇంటి స్థలాలు లేని కుటుంబాల వాస్తవ డిమాండ్‌ను గుర్తించేందుకు ఆర్టీజీఎస్ సహా ఆవాస్ ప్లస్ హౌసింగ్ రెవెన్యూ శాఖల నుంచి డేటాను అనుసంధానం చేసుకుని డూప్లికేషన్ లేకుండా అర్హులను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ విధంగా గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ప్రాథమిక లబ్ధిదారుల జాబితాలను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించి పారదర్శకంగా పరిష్కరించిన అనంతరం తుది జాబితాలను ఖరారు చేయాలని చూస్తోంది.

అందరికీ ఇళ్ళు లక్ష్యంగా :

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న లే అవుట్లలో నిర్మాణాలు చేపట్టని భూమిని అవసరానికి అనుగుణంగా రెండు లేదా మూడు సెంట్ల ప్లాట్లుగా పునర్వ్యవస్థీకరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల గుర్తింపు అలాగే అర్హులైన లబ్ధిదారులకు మ్యాపింగ్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వతమైన ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బాబు చెబుతున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పీఎం జన్ మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలని కోరారు.

5.52 లక్షల ఇళ్ళు పూర్తి :

ఏపీలో పెద్ద ఎత్తున లబ్దిదారులు ఇళ్ళ కోసం వేచి ఉన్నారు. ఈ నేపధ్యంలో వేగవంతంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దాని కోసం డెడ్ లైన్ ని అధికార యంత్రాంగానికి విధించింది. ఈ అయిదు లక్షల ఇళ్లలో 1.5 లక్షల ఇళ్లను పట్టణ ప్రాంతాల్లోనూ నిర్మాణం చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 2.05 లక్షల ఇళ్లు అలాగే 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు అంతా సిద్ధం చేయాలని బాబు డెడ్ లైన్ విధించారు. అలాగే 2027 డిసెంబరు నాటికి 75 వేల కొత్త గృహాలను మంజూరు అయ్యేలా చూడటం తో పాటు 1.5 లక్షల ఇళ్లను పైప్ లైన్ లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన కేటాయింపులు పొందాలని కోరారు.

పారిశ్రామిక టౌన్ షిప్ ల నిర్మాణం :

అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ల నిర్మాణం పెద్ద ఎత్తున ఏపీలో చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని శ్రీసిటీ సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ల ఏర్పాటు ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని బాబు చెప్పారు. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని ఈ టౌన్ షిప్ ల నిర్మాణం చేపట్టాలన్నారు.