వారందరికీ ఉచిత విద్యుత్...కూటమి గుడ్ న్యూస్
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఒక కీలకమైన వర్గానికి ఉచిత విద్యుత్ ని అందిస్తూ నిర్ణయం తీసుకుంది.
By: Satya P | 30 Jan 2026 6:00 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఒక కీలకమైన వర్గానికి ఉచిత విద్యుత్ ని అందిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందనుంది. ఇక మీదట చేనేత మగ్గాలకు 200 యూనిట్లు అలాగే మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని వల్ల ఏకంగా ఒక లక్ష మూడు వేల 534 మంది నేత కార్మిక కుటుంబాలకు భారీ లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
భారీగా ఆదా :
ఇక చూస్తే ఇప్పటిదాకా చేనేత మగ్గాలు మీద పనిచేసే నేత కార్మికులకు నెలకు తక్కువలో తక్కువగా 720 రూపాయలు విద్యుత్ బిల్లు వస్తోంది. ఇది ఏడాదికి దాదాపుగా తొమ్మిది వేల రూపాయలు అవుతోంది. అలాగే మగ్గం మీద పనిచేసే నేతన్నలకు నెలకు 1800 దాకా బిల్లు వస్తూంటే అది ఏడాదికి 22 వేల దాకా సుమారుగా అవుతోంది. ఇపుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఫలితంగా వారికి ఈ మొత్తం భారం తగ్గినట్లే అని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాయితీ వల్ల ఏడాదికి 85 కోట్ల రూపాయల దాకా ఆర్థిక భారం పడుతుంది అని అంటున్నారు. అయితే ఎంతో శ్రమకోర్చి తమ ఉపాధి కోసం కష్టిస్తున్న నేత కార్మికులకు ఆర్ధికంగా అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెబుతున్నారు.
మరో హామీ పూర్తి :
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల ముందు కూటమి పార్టీలు జనంలోకి వెళ్ళి ఇచ్చిన ప్రధాన హామీలలో మరో ముఖ్యమైన హామీని ఈ విధంగా నెరవేర్చినట్లు అవుతోంది. టీడీపీ ప్రభుత్వం గతంలో కూడా నేతన్నలకు అండగా ఉందని ఇపుడు అదే విధంగా భరోసా ఇస్తూ ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
వీరంతా లబ్దిదారులే :
ఏపీలో చూస్తే నేత కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారు ఆర్ధికంగా బలహీనంగా ఉన్నారు. వీరిలో మగ్గం కలిగిన వారు 93 వేల కుటుంబాలుగా లెక్క ఉంది. అలాగే, మర మగ్గాలు వాడుతున్న కుటుంబాలు చూస్తే 10 వేల 534గా ఉన్నాయి. కూటమి వీరందరి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఇప్పతికే నేత కార్మికులకు ప్రభుత్వం ఒక హామీని అమలు చేస్తోంది. యాభై ఏళ్ళు నిండిన నేతన్నలకు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ వస్తోంది.
వారి కోసం మాల్స్ :
ఇక రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులకు గిరాకీ పెంచడానికి కూటమి ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. కో ఆప్టెక్స్, టాటా తనేరియా, బిర్లా ఆద్యం సంస్థలతో ప్రభుత్వం ఈ అవగాహన ఒప్పందాలు చేసుకుంటోంది. దీంతో ఆప్కోలో రెడీ మేడ్ దుస్తుల అమ్మకాలతో నేతన్నలకు ఉపాధి బాగా పెరిగిదని కూడా తెలుస్తోంది. అలాగే ఆన్ లైన్ ద్వారా ఈ కామర్స్ లో ద్వారా చేనేత వస్త్రాలను విక్రయించడం మరో పెద్ద మార్పుగా ఉంది. అంతే కాకుండా విశాఖలో అయిదు ఎకరాలలో 172 కోట్ల రూపాయలతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నారు. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు, మంగళగిరిలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ధర్మవరంలో 30 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ నిర్మిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
