Begin typing your search above and press return to search.

ఉచిత బస్సు పథకానికి లైన్ క్లియర్.. ఆగస్టు 15న ప్రారంభం

మంత్రి ప్రకటనతో ఉచిత బస్సు ప్రయాణంపై మరింత క్లారిటీ వచ్చింది. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించాయి.

By:  Tupaki Desk   |   18 July 2025 3:33 PM IST
ఉచిత బస్సు పథకానికి లైన్ క్లియర్.. ఆగస్టు 15న ప్రారంభం
X

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏడాదిగా పథకం అమలు తేదీని వాయిదా వేస్తున్న ప్రభుత్వం ఈ సారి చెప్పిన ముహూర్తానికే రైట్ రైట్ చెబుతోంది. గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించినట్లే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పునరు్ద్ఘాంటించారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో పర్యటించిన మున్సిపల్ మంత్రి నారాయణ ఉచిత బస్సుపై కీలక ప్రకటన చేశారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ‘‘ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క హామీ నుంచి వెనక్కి తగ్గట్లేదు’ అంటూ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నట్లు మంత్రి వివరించారు. వచ్చేనెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.

మంత్రి ప్రకటనతో ఉచిత బస్సు ప్రయాణంపై మరింత క్లారిటీ వచ్చింది. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించాయి. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రధానమైనది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా, ఈ హామీని నెరవేర్చలేదని ప్రతిపక్షం వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే తెలంగాణ, కర్ణాటకల్లో అమలు అవుతున్న ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వస్తోంది.

ఇక గత నెలలో కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలుమార్లు ప్రకటనలు చేశారు. తాజాగా మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ఉచిత బస్సు పథకంపై మాట్లాడటంతో ప్రభుత్వం చెప్పిన ముహూర్తానికి ఉచిత బస్సు హామీ నెరవేరనున్నట్లు భావిస్తున్నారు.