Begin typing your search above and press return to search.

ఫ్యాక్ట్ చెక్: వరద ముంపులో అమరావతి?

సోషల్ మీడియాలో ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తించడం కష్టమవుతోంది. ప్రధానంగా రాజకీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సివస్తోంది.

By:  Tupaki Desk   |   14 Aug 2025 6:52 PM IST
ఫ్యాక్ట్ చెక్: వరద ముంపులో అమరావతి?
X

సోషల్ మీడియాలో ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తించడం కష్టమవుతోంది. ప్రధానంగా రాజకీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సివస్తోంది. కొన్నిసార్లు నిజాలు నిర్ధారించుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇక అసలు విషయానికి వస్తే ఏపీలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోరాటం జరుగుతుంది. ఇందులో సోషల్ మీడియా పాత్ర అత్యధికం. నిత్యం తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేలా ఉభయ పార్టీలు సోషల్ మీడియాలో పోటాపోటీ పోస్టులు పెడుతుంటాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై మరోసారి ఫేక్ ప్రచారం జరుగుతోందని టీడీపీ సోషల్ మీడియా ఆరోపిస్తోంది.

ఏపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం, గురువారం కురిసిన వర్షాలతో పలు చోట్ల వరద పోటెత్తింది. ఇక రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. రాజధాని ప్రాంతంలోని కొండవీడు వాగు పొంగి ప్రవహించింది. ఇక పక్కనే ఉన్న విజయవాడలో కూడా బుడమేరు, కృష్ణ నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గత ఏడాది బుడమేరు వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. ఈ సారి బుడమేర ముంపు లేకపోయినా, కృష్ణ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా ప్రజా జీవితానికి పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదని చెబుతున్నారు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధమైన ప్రచారం జరుగుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రాజధానిపై అపోహలు సృష్టించేందుకు భారీ వర్షాలకు అమరావతి ముంపునకు గురైందని ప్రచారం చేస్తున్నారు. రాజధాని ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయిందని పెద్ద ఎత్తున వీడియోలను వైరల్ చేస్తున్నారు. అయితే పులివెందుల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అధికార పార్టీ చాలా సమయం వైసీపీ ప్రచారాన్ని గమనించలేదు. అమరావతి ముంపు అన్న వీడియోలు వైరల్ కావడంతో శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వం స్పందించింది. ఆ వీడియోలను ఫ్యాక్ట్ చెక్ చేసింది.

అమరావతి ముంపు అంటూ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం ఫేక్ అంటూ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తేల్చింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రచారం చేస్తున్న వీడియోలు పల్నాడు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడు గ్రామంలోని వాగు దృశ్యాలుగా నిర్ధారించింది. కంభంపాడులో వాగు పొంగి చప్టా పైనుంచి పారితే, ఆ దృశ్యాలను అమరావతి ప్రాంతానికి అంటూ తప్పు దోవ పట్టిస్తున్నట్లు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీం ఎక్స్ లో వెల్లడించారు. కంభంపాడు గ్రామం అమరావతి రాజధానికి 120 కిలోమీటర్ల దూరంలోని ఉంటుందని వివరించింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు ప్రచారం చేసే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది.