Begin typing your search above and press return to search.

జగన్ విమానాల ఖర్చు.. రచ్చ రేపిన టీడీపీ సోషల్ మీడియా!

ఏపీ రాజకీయం నిత్యం మండుతున్న అగ్ని గుండంగానే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉంటోంది.

By:  Tupaki Political Desk   |   2 Dec 2025 10:25 PM IST
జగన్ విమానాల ఖర్చు.. రచ్చ రేపిన టీడీపీ సోషల్ మీడియా!
X

ఏపీ రాజకీయం నిత్యం మండుతున్న అగ్ని గుండంగానే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉంటోంది. తాజాగా, గత ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న విమాన ఖర్చులపై రచ్చ రాజుకుంటోంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పర్యటనలకు విచ్చలవిడిగా విమానాలు, హెలికాఫ్టర్లు వాడుతున్నారని, ఈ ముగ్గురు ప్రతివారం తమ ప్రైవేటు పర్యటన కోసం హైదరాబాద్ వస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గత కొంతకాలంగా వైసీపీ ప్రచారం చేస్తోంది. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లోకేశ్ పర్యటనల లెక్కలు చెబుతూ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది.

ముఖ్యంగా మంత్రి లోకేశ్ పర్యటనలను టార్గెట్ చేస్తున్న వైసీపీ.. 77 సార్లు విమాన ప్రయాణాలు చేశారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. దీనికి కౌంటరుగా రంగంలోకి దిగిన టీడీపీ సోషల్ మీడియా ఆర్టీసీ సమాచారం ద్వారా సేకరించిన ఆధారాలతో వైసీపీపై కౌంటరు అటాక్ చేస్తోంది. లోకేశ్ విమాన ప్రయాణాలపై ఓ ఆర్టీఐ కార్యకర్త సమాచారం అడిగితే.. మంత్రిగా లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సమాధానం వచ్చింది.

లోకేశ్ రాష్ట్రమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అధికారిక కార్యక్రమానికి వెళ్లినా తన సొంత ఖర్చులతోనే ప్రయాణాలు చేస్తున్నారని వెల్లడైంది. వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నట్లు లోకేశ్ 77 విమాన టూర్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదని స్పష్టమైందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక లోకేశ్ విమాన ఖర్చులు బయటపెట్టినట్లే.. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ విమాన ప్రయాణాలు, అందుకు అయిన డబ్బుపై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి కౌంటరుగా ట్రోలింగ్ మొదలుపెట్టింది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో సుమారు రూ.222 కోట్ల రూపాయల ప్రజాధనంతో విమాన ప్రయాణాలు చేశారని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారాన్ని ఆధారంగా చూపుతోంది. జగన్ ఐదేళ్లు సీఎంగా పనిచేయగా, ఎక్కడికి వెళ్లినా ప్రజాధనంతో హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాల్లో తిరిగారని, ఏడాదికి సరాసరి రూ.50 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ చెబుతోంది. అంతేకాకుండా కరోనా కాలంలో కూడా జగన్ హెలికాప్టర్లలోనే విలాసంగా తిరిగారని ఆరోపిస్తోంది. ఇక ఆయన జల్సాల కోసం లండన్ వెళ్లగా, అప్పుడూ ప్రభుత్వ ధనాన్నే వినియోగించారని టీడీపీ విమర్శిస్తోంది. జగన్ నివాసం ఉన్న తాడేపల్లి నుంచి పక్కనే ఉన్న గుంటూరు వెళ్లాలన్నా హెలికాఫ్టర్ వినియోగించడాన్ని ఎత్తిచూపుతోంది.

దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య విమాన ప్రయాణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకు మంత్రి లోకేశ్ ప్రయాణాలపై దాడి చేసిన వైసీపీ సోషల్ మీడియా.. టీడీపీ కౌంటర్ అటాక్ చేసిన తర్వాత స్లో అయినట్లు కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలపై ప్రభుత్వం, టీడీపీ మీడియా అటాక్ పెంచిన తర్వాత వైసీపీ డైలమాలో పడిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పటికీ ఈ డిబేట్ రాష్ట్ర రాజకీయాలను మరోసారి వేడెక్కించిందని అంటున్నారు.