Begin typing your search above and press return to search.

కోటి ఎకరాల సాగు...ఆకాశం వైపు చూపు !

ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయికమైన రాష్ట్రం. మొదటి నుంచి ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టేది వ్యవసాయమే.

By:  Satya P   |   17 July 2026 9:59 AM IST
కోటి ఎకరాల సాగు...ఆకాశం వైపు చూపు !
X

ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయికమైన రాష్ట్రం. మొదటి నుంచి ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టేది వ్యవసాయమే. విభజన తరువాత ఐటీ సర్వీస్ సెక్టార్లతో పాటు ఇండస్ట్రీ రంగాల విషయంలో పాలకులు ఫోకస్ పెడుతున్నా వాటి ఫలితాలు వచ్చేసరికి ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రాణాధారం ఆర్ధికంగానే కాదు అన్ని విధాలుగా జీవాధారం అయిన వ్యవసాయం మీద ఈసారి ఎల్ నినో ప్రభావం తో నీలి నీడలు కమ్ముకున్నాయి. వ్యవసాయానికి వరుణుడి సాయం లేకుండా పోయిన ఏడాదిగా ఈసారి రికార్డులకు ఎక్కుతోంది.

ఎన్నడూ చూడనంత కరవు :

గతంలో ఎన్నడూ చూడనంత కరవు ఈసారి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటాయి. వాన చుక్క కూడా కానరాక అంతా ఆకాశం వైపు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఏపీలో చూస్తే కరువు కోరలు చాచి ఉంది అనడానికి గత నెలన్నర డేటా కళ్ల ముందు ఉంది. అధికారికంగా నైరుతి పవనాలు ఏపీకి జూన్ 6న ప్రవేశించారు. మొదట్లో ఒకటి రెండు చినుకులు కురిసి ఊరించినా కూడా ఆ మీదట వానల జాడ ఎక్కడా లేకుండా పోయింది. దాంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయని అంటున్నారు. ఈ నెలన్నర రోజులలో చూసుకుంటే ఏకంగా 49.3 శాతం తక్కువగా వర్షం కురిసింది అని లెక్కలు చెబుతున్నాయి.

రీజియన్ల వారీగా లెక్కలివే :

మరో వైపు చూస్తే ఏపీలో ఉన్న మూడు ప్రధాన రీజియన్లలో వర్షాభావ పరిస్థితులు చూస్తే కనుక రాయలసీమకు అమితంగా కరవు రక్కసి పట్టి పీడిస్తోంది అని చెప్పాలి. ఇక ఏపీ మొత్తంగా ఈ నెలన్నర రోజులలో సగటున 170.3 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 86.3 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే పడింది. అంటే సగానికి సగం లోటుగానే చెబుతున్నారు. ఇక రాయలసీమలో చూస్తే జూన్ లో వర్షాభావం అలాగే ఉంటే జూలైలో తొలి పదిహేను రోజుల్లో 94 శాతం మైనస్‌ గా వర్ష పాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఈ పదిహేను రోజులలోనే 45.87 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా కేవలం 3.02 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదు అయింది.అదే సమయంలో కోస్తాలో 78.97 మిల్లీమీటర్ల వర్షపాతానికి గానూ అతి తక్కువగా 23.64 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే కోస్తా జిల్లాలలో ఏకంగా 70 శాతం తక్కువ వర్షం నమోదైంది అన్న మాట.

సాధారణ వర్షాలు లేవు :

ఈసారి రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలలో ఎక్కడా కూడా సాధారణమైన స్థాయిలో వర్షాలు పడలేదు అంటే కరవు ఇనుప పదఘట్టనలు ఎంత బలంగా ఉన్నాయో అర్ధం చేసుకోవాల్సిందే. అన్ని చోట్లా అత్యల్ప స్థాయిలోనే వర్షపాతం నమోదు అయింది. ఇక 676 మండలాలుండగా 80 శాతానికిపైగా మండలాల్లో వర్షాభావం నెలకొందని ప్రభుత్వం వద్ద నున్న అధికారిక లెక్కలే తెలియచేస్తున్నాయి. అనేక జిల్లాలలో వర్షాభావం రికార్డు స్థాయిలో ఉండడం చూస్తూంటే ప్రకృతి ఎంతలా పగబట్టింది అన్నది తెలుస్తోంది.

ఖరీఫ్ కి భారీ దెబ్బ :

ఖరీఫ్ సీజన్ ప్రతీ ఏటా జూన్ జూలైలో మొదలవుతుంది. నాలుగు నెలల పాటు సాగే ఈ సీజన్ లో పంట ఏడాది అక్టోబర్ నాటికి వస్తుంది. నైరుతి రుతు పవనానాలను నమ్ముకునే ఏపీలో ఖరీఫ్ సాగు అంతా సాగుతుంది. ఎందుకంటే భూగర్భ జలాలు కూడా వర్షాల మీదనే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు పడితే భూగర్భం నుంచి నీటి మట్టాలు పెరిగి బోర్ల ద్వారా అయినా మెట్ట ప్రాంతాలలో సాగుకు ఆస్కారం ఉంటుంది. కానీ వానలు ఈసారి ఎక్కడా బొత్తిగా కురవకపోవడంతో ఖరీఫ్ సీజన్ కి భారీ దెబ్బగా చెబుతున్నారు. ఒక వైపు వానలు లేవు మరో వైపు గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజుకీ చాలా చోట్ల నమోదు అవుతున్నాయి.

ఈ ఏడాది సెలవు చీటి రాసేలా :

దాంతో చేలలో సేద్యానికి పూర్తిగా ఈ ఏడాది సెలవు చీటి రాసేలా ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వర్షాధారంపై పండించే మెట్ట పంటల పరిస్థితి కూడా తారు మారు అవుతోంది. వేరుశనగ, పత్తి, పప్పుధాన్యాలు, తృణ ధాన్యాల సేద్యం కూడా ప్రశ్నార్ధకం అయింది. మరో వైపు రిజర్వాయర్లలో నీరు కూడా డెడ్ స్టోరేజీలోకి వెళ్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మొత్తం మీద జూలై లో రెండవ పక్షంలో అయినా వానలు కురిస్తేనే వ్యవసాయానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని అంటున్నారు.