Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో బిగ్ ఫైట్ కు కీ ఇచ్చిన కేంద్రం... వైసీపీ ఉపయోగించుకుంటుందా..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   11 Feb 2026 8:00 PM IST
అసెంబ్లీలో బిగ్  ఫైట్  కు  కీ ఇచ్చిన కేంద్రం... వైసీపీ ఉపయోగించుకుంటుందా..!
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరసన తెలిపిన వైసీపీ సమావేశాన్ని బైకాట్ చేసి వాకౌట్ చేసింది! మరోవైపు 17 రోజుల పాటు అంటే మార్చి 7 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం నిర్ణయించింది. దీని ముందు కేంద్రం నుంచి ఓ ఆసక్తికర ప్రకటన వెలువడింది.

అవును... ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుమారు ఏడాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఇంతలో కేంద్ర పార్లమెంటులో వెల్లడించిన ఓ నివేదిక ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా... దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రైతు ఎక్కువగా అప్పుల ఊబిలో ఉన్నాడని.. దేశ రైతు సగటు అప్పుతో పోలిస్తే చాలా ఎక్కువ లోతులో ఉన్నాడనే రిపోర్ట్ తెరపైకి వచ్చింది. దీంతో.. ఏపీ అసెంబ్లీలో బిగ్ ఫైట్ కి కీ వచ్చిందని అంటున్నారు.

తాజాగా లోక్ సభలో రైతుల అప్పులపై ఓ కీలక చర్చ జరిగింది. ఈ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో.. దేశంలోని రైతులందరికంటే ఆంధ్రప్రదేశ్ రైతు ఎక్కువ అప్పుల్లో ఉన్నాడని తెలిపారు. ఇందులో భాగంగా... కేంద్రమంత్రి చెప్పిన గణాకాల ప్రకారం.. జులై 2018 - జూన్ 2019 మధ్య కాలానికి సంబంధించి ఏపీలో సగటు రైతు అప్పు రూ.2,35,554!

దీంతో... ఏపీలో రైతు "రాజు" కాకపోయినా పర్లేదు కానీ.. ఇలా అప్పులకు బానిస మాత్రం కాకూడదనే చర్చ మొదలైంది! ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం.. అంతకంటే ముందు పెట్టుబడి పెరగడం.. నకిలీ విత్తనాల ప్రభావం మొదలైనవే కారణాలని అంటున్నారు.. ఇవన్నింటికీ ప్రభుత్వాలే కారణాలని చెబుతున్నారు! ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు రాజులా కనిపించే రైతు.. ఎన్నికలయ్యాక బానిసలా కనిపిస్తున్నాడని అంటున్నారు!

ఈ సమయంలో.. తాజాగా అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీకి వైసీపీ నేతలు హాజరై, వారికి మాట్లాడేందుకు మైకు దొరికితే కచ్చితంగా ఈ తాజా ఘణాంకాలు హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. తాజా గణాంకాలు ఏపీలో టీడీపీ - బీజేపీ (2014 - 19) ప్రభుత్వ సమయానికి సంబంధించినవి కావడంతో నాడు ఆ సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమే అధికారంలో ఉంది! మరి ఈ అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుందా.. లేక, వచ్చి వెళ్లిపోతారా అనేది వేచి చూడాలి!

మరోవైపు ఈ జాబితాలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతీ రైతు సగటు అప్పు రూ.1,52,113 గా ఉంది. ఇక ఓవరాల్ గా భారతదేశం మొత్తం మీద రైతుల సగటు అప్పు రూ.74,121. అంటే... జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే.. సుమారు మూడు రెట్లు అప్పు ఆంధ్ర ప్రాంత రైతు పై ఉందన్నమాట!