పిడుగురాళ్ళ కాదు...నిప్పుల వాన !
భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. మంటలతో మండిపోతున్నాయి. నెత్తిన సూరీడు రగిలిపోతూ పగపట్టినట్లుగా తెలుగు నేలను కాల్చేస్తున్నాడు.
By: Tupaki Political Desk | 21 May 2026 8:41 PM ISTభానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. మంటలతో మండిపోతున్నాయి. నెత్తిన సూరీడు రగిలిపోతూ పగపట్టినట్లుగా తెలుగు నేలను కాల్చేస్తున్నాడు. ఇంట్లో ఉక్క బోత బయట వడ దెబ్బలతో ఎక్కడిది దారి అని ప్రజలంతా కలవరపడుతున్నారు. ఏసీలు సైతం ఆపలేని వేడి ఇది అని అంటున్నారు. గిర్రున కరెంట్ మీటర్లు తిరుగుతున్నాయి కానీ స్వాంతన అయితే దక్కడం లేదని జనాలు గోడు పెడుతున్నరు.
రికార్డులు బద్దలు :
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు ముదిరిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో గురువారం అయితే అన్ని చోట్లా పెద్ద ఎత్తున ఎండలు కాసాయి. కొన్ని చోట్ల ఏకంగా 47 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావడం విశేషం. ఏపీలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో అత్యధికంగా 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో అక్కడ ప్రజలు ఏకంగా నరకాన్నే చూశారు.
ఆ జిల్లాలు నిప్పుల కొలిమి :
ఇక ఏపీ వ్యాప్తంగా చూస్తే 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పై దాటినట్లుగా వాతావరణ శాఖ వివరాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని చెబుతున్నారు. ఇందులో పల్నాడు జిల్లాలో 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలూరు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపించింది. మరి కొన్ని రోజుల పాటు ఇవే ఎండల తీవ్రతతో పాటు వడ గాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గ్రీష్మ ప్రతాపం :
ఇక ఏపీలో బాపట్ల జిల్లా వేట పాలెం, అలాగే ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో 47.4 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు గురువారం నమోదు అయ్యాయి. ఏల్లూరు జిల్లా అల్లిపిల్లిలో 47.3 డిగ్రీల సెల్సియస్ గా ఉంటే మార్కాపురం జిల్లా నందన మారెళ్ళలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు నమోదు అయింది. అల్లూరి జిల్లాలోని కూనవరం లో 46.5 డిగ్రీల సెల్సియస్, నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీలు, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
అప్రమత్తం తప్పదు :
ఏపీలోని అన్ని చోట్లా ఒకే తీరున అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న సమయంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ అధిక ఎండలు ఈ నెల 25 దాకా దాకా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ నెల 22న ఏపీ వ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు అలాగే 219 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
