తమిళనాడు సెంటిమెంట్ ని నమ్ముతున్న జగన్ !
ఏపీలో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది. నిజానికి ఇది దారుణమైన నంబర్. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతలా తక్కువ సీట్లు తెచ్చుకున్న దాఖలాలు లేవు.
By: Tupaki Desk | 12 April 2025 9:19 AM ISTఏపీలో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది. నిజానికి ఇది దారుణమైన నంబర్. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతలా తక్కువ సీట్లు తెచ్చుకున్న దాఖలాలు లేవు. నిజానికి ఈ నంబర్ వస్తే పార్టీ క్లోజ్ అన్న భావన కూడా ఉంటుంది కానీ వైసీపీలో ఓడి ఏడాది కూడా తిరగకముందే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నామన్న ధీమా పెరగడానికి కారణం ఏంటి అన్న చర్చ సాగుతోంది.
ఏపీలో చూస్తే రాజకీయం రెండుగా చీలి ఉంది అన్నది స్పష్టం. 2019 సమయంలో అయితే జనసేన వామపక్షాలు బీఎస్పీతో కలుపుకుని థర్డ్ ఫోర్స్ గా ముందుకు వచ్చింది ఆరేడు శాతం ఓట్లను కూడా సాధించింది. కానీ ఆ పార్టీ టీడీపీ కూటమిలోకి చేరిపోవడం వైసీపీకి 2024 ఎన్నికల్లో మైనస్ అయినా రాజకీయంగా లాంగ్ రన్ లో మాత్రం మేలే చేసింది అని అంటున్నారు.
ఎందుచేతనంటే ఏపీలో టీడీపీని ఓడించడం అంటే కూటమి మొత్తం పార్టీలను ఓడించడమే. అలా జనసేన కూడా అధికారం పంచుకుంటూ టీడీపీతో కలసే 2029 ఎన్నికల్లో పోరాడాల్సి ఉంటుంది. గెలిస్తే ఓకే కానీ ఓటమి చెందితే ఆ పార్టీతో కలిసే చవి చూడాల్సి ఉంటుంది.
అలా రాజకీయ మైదానంలో వైసీపీకి సగానికి సగం జాగాను జనసేన కూడా వదిలేసినట్లు అయింది. వామపక్షాలు కాంగ్రెస్ బలాలు ఏపీలో నామమాత్రం. దాంతో కూటమి పట్ల వ్యతిరేకత వస్తే కచ్చితంగా జనాలు వైసీపీనే కోరుకుంటారు అన్నది జగన్ మార్క్ పొలిటికల్ థియరీ.
ఇక చూస్తే కనుక ఏపీలో విభజన తరువాత రాజకీయం జనాల ఆలోచనలు ఒక పద్ధతిలో ఉన్నాయి. ఒక ఎన్నికల్లో ఒక పార్టీని గెలిపించిన జనాలు తరువాత ఎన్నికల్లో మరో పార్టీని గెలిపిస్తున్నారు. గెలిచిన పార్టీకి ఎందుకు గెలిచామన్న ప్రశ్న తలెత్తకపోయినా ఓడిన పార్టీ కచ్చితంగా ఇలా ఎందుకు జరిగింది అని విశ్లేషించుకునే సీన్ వస్తోంది.
నిజానికి చూస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ పాలన మరీ అంత బాడ్ గా ఏమీ లేదు. బొత్తిగా 23 సీట్లు ఇచ్చి జనాలు ఓడించారు. అలాగే 2024లో వైసీపీకి కనీసంగా ముప్పయి నుంచి నలభై సీట్లు అయినా వచ్చి ఉండాలి. కానీ వన్ సైడెడ్ గా కూటమికి ఓట్లు వేసి జనాలు వైసీపీని ప్రతిపక్ష హోదాకే ఆమడ దూరంలో ఉంచారు.
ఇలా మూడు ఎన్నికల్లో మూడు భిన్న తీర్పులు ఇచ్చిన ఏపీ ప్రజల గురించి విశ్లేషించినపుడు లాజిక్ కి అందరిది ఏదో ఉందనిపిస్తుంది. అంతే కాదు వారికి మార్పు కావాలి అని కూడా అనిపిస్తుంది అయిదేళ్ళకు ఒక మారు తమకు ఉన్న ఆప్షన్స్ ని వాడుకుని వీరిని దించి వారిని గద్దెనెక్కించాలన్న ఆకాంక్ష కూడా కనిపిస్తోంది.
అందుకే ఎంత బాగా పాలించినా అయిదేళ్ళకు మాత్రమే అని జనాలు బయటకు చెప్పని ఒక అన్ కండిషనల్ తీర్పుని ముందే చెప్పి ఉంటున్నారు అని విశ్లేషిస్తున్నారు. బహుశా ఈ తరహా విశ్లేషణను జగన్ గట్టిగా నమ్ముతున్నారు. దానికి తనకు వచ్చిన 11 సీట్ల ఓటమిని కూడా కలిపి కూడుకుని ఆయన జనం సైకాలజీని పసిగడుతున్నట్లుగా ఉన్నారు. అందుకే ఆయన పార్టీ వేదికల మీద అయినా లేదా బయట మీడియా మీటింగులో అయినా ఒక్కటే చెబుతున్నారు,.
మళ్ళీ వచ్చేది మేమే అని. 2029లో నేనే సీఎం ని అని ఆయన బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఏపీలో ప్రజలు తమిళనాడు మాదిరిగా తీర్పు ఇస్తున్నట్లుగా ఉంది. అక్కడ కూడా అంతే. ఒక పార్టీకి ఒకసారే పవర్ ఇస్తూ ఉంటారు. అలా డీఎంకే అన్నాడీఎంకేల మధ్య దశాబ్దాల పాటు అధికారం మారింది. ఇపుడు ఏపీలో నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న వైసీపీ కూడా మరో పది శాతం 2029 నాటికి కూడగట్టలేమా అన్న ధైర్యంతో ఉంది. సో జగన్ తమిళనాడు ఫార్ములానే నమ్ముకున్నారు. మరి ఏపీ జనం 2029లో అట్టు తిరగేసినట్లుగా అటుని ఇటు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.
