Begin typing your search above and press return to search.

పనిచేయని మొబైల్, టీవీ, ఏసీ ఏదైనా పర్లేదు ప్రభుత్వం కొనేస్తుంది..!

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   19 April 2025 4:20 PM IST
పనిచేయని మొబైల్, టీవీ, ఏసీ ఏదైనా పర్లేదు ప్రభుత్వం కొనేస్తుంది..!
X

మీ పాత మొబైల్ పనిచేయడం లేదని ఇంట్లో వదిలేశారా? పాడైపోయిన టీవీ ఇంట్లో అడ్డంగా ఉండిపోయిందా? వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయపోతే ఏం చేస్తారు..? పాత సామాన్లు, పాడైపోయిన వస్తువులను కొనుగోలు చేసే వ్యాపారులు కూడా వాటిని తీసుకోవడం లేదని పారేస్తున్నారా? ఇకపై మీకు ఆ అవసరం ఉండదు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్కులర్ ఎకానమీకి ప్లాన్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ-వేస్ట్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 222 ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ స్వయంగా ప్రకటించారు.

స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ శనివారం ఇ-థీమ్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇళ్లల్లో పేరుకుపోయిన ఆరు బయట పారేస్తున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీ సైకిల్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతోపాటు రీ సైకలింగ్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే నినాదంతో ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రాలు పనిచేస్తాయి. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటికి డబ్బు కూడా చెల్లించనున్నారు. ఈ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో రీసైకిల్ చేసి పునర్వినియోగించేలా చేస్తామంటున్నారు. ఈ-వ్యర్థాలు ఆరు బయట పారేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. అదే శాస్త్రీయ పద్ధతిలో వాటిని డిస్పోజ్ చేయడం ద్వారా విలువైన లోహాలను సేకరించేందుకు అవకాశం ఉందంటున్నారు. బంగారం, వెండి, ఇత్తడి వంటి లోహాలు కూడా ఈ-వేస్ట్ లో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

కేంద్ర ప్రభుత్వం కూడా ఈ-వేస్ట్ నిర్వహణపై ఫోకస్ చేయడం.. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేలా భారీగా నిధులు కేటాయిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో 222 కేంద్రాలను ఏర్పాటు చేసి ఇ-చెక్ అనే పేరుతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరిస్తారు. పాత, పనికి రాని ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్రభుత్వం డబ్బు ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.