బాబుకు సూచన: ఉద్యోగులను పట్టించుకోవాల్సిందే..!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం.. నానాటికీ ముదురుతోంది. ప్రస్తుతం పైకి అంతా బాగుందన్న వాదన వినిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఉద్యోగులు రగులుతున్నారు.
By: Garuda Media | 29 July 2025 3:35 PM ISTఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం.. నానాటికీ ముదురుతోంది. ప్రస్తుతం పైకి అంతా బాగుందన్న వాదన వినిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఉద్యోగులు రగులుతున్నారు. ప్రధానంగా మూడు కారణాలతో ఉద్యోగులు సర్కారుపై ఉద్యమించేందుకు రెడీ అవుతున్నారు. ఈ పరిణామాలే.. ఉద్యోగుల విషయాన్ని సర్కారు పట్టించుకోవాలన్న సూచనలకు దారితీస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం కూడా.. ఇలానే సాచివేత ధోరణిని అవలంభించడంతో ఉద్యోగులు ఎన్నికల సమయంలో రివర్స్ అయ్యారు.
ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇప్పతి నుంచే కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయాన్ని పరిశీలిం చాలి.. పట్టించుకోవాలి. ప్రధానంగా ఉద్యోగులు మూడు అంశాలను లేవనెత్తుతున్నారు.
1) పీఆర్సీ బకాయిలు.. కొత్త పీఆర్సీ వేయడం: గతంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ అమలు చేసిందన్న ఆవేదన ఉద్యోగుల్లో ఉంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతున్నారు. దీనికి గత ఎన్నికల సమయంలో సర్కారు హామీ ఇచ్చిందని చెబుతున్నారు. ఇదే సమయంలో కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలని.. కోరుతున్నారు.
2) సచివాలయాలను తిరిగి ప్రారంభించాలని వారు కోరుతున్నారు. వైసీపీ హయాంలో సచివాలయాలు ఉండడంతో తమపై పనిభారం తగ్గిందని.. ఇప్పుడు వాటిని సుప్తచేతనావస్థలో(ఉండీ ఉండనట్టు) ఉంచడంతో తమపై భారం పెరిగిందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి వాటిని లైన్‌లో పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ.. ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీతో ఉంది. ఇది సర్దుకు పోయే సమస్య అని మంత్రులు చెబుతున్నారు.
3) పీ-4 కార్యక్రమాన్ని తమపై బలవంతంగా రుద్దుతున్నారని.. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. పీ-4 పథకంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లతోపాటు.. విభాగాల అధిపతులు.. క్లాస్-1, 2 ఉద్యోగులు.. పేదలను దత్తత తీసుకోవాలనిప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోం దని చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు వస్తున్న వేతనాలతో తామే జీవనం సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఇలాంటి సమయంలో తమపై ఈ భారం మోపడం సరికాదని ఉద్యోగులు చెబుతున్నారు. మరి ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేస్తున్నారో.. లేక కార్యదర్శులు నిర్ణయం తీసుకున్నారో తేల్చాల్సి ఉంది. లేకపోతే.. ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలడం ఖాయంగా కనిపిస్తోంది.
