Begin typing your search above and press return to search.

మూడేళ్ల వరకు బాదుడు ఉండదు.. మంత్రి గొట్టిపాటి రవి బంపర్ ఆఫర్

ఇప్పుడు ఈ చార్జిలను వసూలు చేయకపోగా, 'ట్రూ డౌన్' విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవి తాజాగా ప్రకటించారు.

By:  Tupaki Political Desk   |   12 Jun 2026 3:00 PM IST
మూడేళ్ల వరకు బాదుడు ఉండదు.. మంత్రి గొట్టిపాటి రవి బంపర్ ఆఫర్
X

కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో 'ట్రూ అప్' చార్జీల పేరిట ప్రజలపై మోపిన అదనపు భారాన్ని తగ్గిస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 'ట్రూ డౌన్' వరాలను ప్రకటించింది. గతంలో ఎప్పుడో వాడిన విద్యుత్‌కు, ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు పెంచిన అదనపు బిల్లులను కలిపి వసూలు చేసేవి. దీనిని బిల్లులో ట్రూ అప్ చార్జిలుగా చూపేవారు. ఇలా గత ప్రభుత్వంలో ఏకంగా 9 సార్లు ట్రూ అప్ చార్జీలను వసూలు చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ చార్జిలను వసూలు చేయకపోగా, 'ట్రూ డౌన్' విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవి తాజాగా ప్రకటించారు.

గతంలో వినియోగదారులు చెల్లించిన అదనపు బిల్లులను గుర్తించి ఆ మొత్తాన్ని తగ్గిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం యూనిట్‌కు 13 పైసల చొప్పున చార్జీలు తగ్గాయని మంత్రి గొట్టిపాటి రవి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి గొట్టిపాటి శుక్రవారం ఒక సంచలన ప్రకటన చేశారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలను పెంచలేదని గుర్తుచేశారు. రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోమని స్పష్టం చేశారు. ఎప్పుడో వాడిన కరెంట్‌కు అధిక బిల్లులు వసూలు చేసిన చరిత్ర వైసీపీదైతే.. ప్రజలు కట్టిన అదనపు సొమ్మును తిరిగి తగ్గిస్తున్న చరిత్ర కూటమి ప్రభుత్వానిదని ఆయన లాజిక్‌తో సహా వివరించారు. ఇదే నిజమైన సంక్షేమ పాలన అని మంత్రి పేర్కొన్నారు.

విపక్షానికి గట్టి కౌంటర్

కూటమి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఒకవైపు వైసీపీ 'వెన్నుపోటుకు రెండేళ్లు' అంటూ ఆందోళనలు చేస్తుంటే.. అదే రోజు మంత్రి గొట్టిపాటి 'ట్రూ డౌన్' వివరాలను బయటపెట్టి విపక్షానికి గట్టి షాక్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. ఐదేళ్లలో 9 సార్లు రేట్లు పెంచిన వారికీ, రెండేళ్లుగా రూపాయి పెంచకుండా పైగా బిల్లులు తగ్గిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ఏపీలో 'ట్రూ అప్' బాదుడు కాలం పోయి, 'ట్రూ డౌన్' ఊరట కాలం వచ్చిందని మంత్రి తన ప్రకటనలో వివరించారని అంటున్నారు.