Begin typing your search above and press return to search.

చరిత్రలో తొలిసారి : రివర్స్ లో విద్యుత్ ఛార్జీలు!

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. విద్యుత్ పంపిణీ సంస్థలు వరుసగా రెండోసారి ట్రూ-డౌన్ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   15 July 2026 12:23 PM IST
చరిత్రలో తొలిసారి : రివర్స్ లో విద్యుత్ ఛార్జీలు!
X

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. విద్యుత్ పంపిణీ సంస్థలు వరుసగా రెండోసారి ట్రూ-డౌన్ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తద్వారా విద్యుత్ చార్జీల భారం తగ్గనుందని చెబుతున్నారు. గత ఏడాది యూనిట్ కు 13 పైసలు చొప్పున తగ్గించిన విద్యుత్ సంస్థలు ఈ ఏడాది కూడా అంతే మొత్తాన్ని తగ్గించాలని నిర్ణయించాయి. దీంతో విద్యుత్ బిల్లులు యూనిట్ కు 26 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. ఈ విధానంలో భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే రానున్న రోజుల్లో యూనిట్ కు రూపాయి మేర తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సగటు వినియోగదారుడికి తగ్గించిన మొత్తం పెద్దగా ఊరట కలగకపోయినా రాష్ట్రంలో మొత్తం గృహ వినియోగదారులకు 940 కోట్ల మేర ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

సామాన్యుడి గృహ బడ్జెట్‌లో కరెంటు బిల్లు ఒక ముఖ్యమైన భాగం. ఇప్పుడు చార్జీల తగ్గింపు వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలకు నెలవారీ ఖర్చులలో కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. తద్వారా కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి ఇది దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాకుండా విద్యుత్ చార్జీల తగ్గింపు పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గడం వల్ల చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని అంటున్నారు. తయారీ రంగంలో ఖర్చులు తగ్గినప్పుడు, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రవాణా, కోల్డ్ స్టోరేజ్, ఇతర సేవల రంగాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే అవకాశాలు మెరుగవుతాయని అంటున్నారు.

ఈ ఆర్థిక సంవత్సతరంలో రూ.940.07 కోట్ల మిగులును చూపుతూ ఏపీఈఆర్‌సీకి డిస్కంలు నివేదికలు సమర్పించాయి. రాష్ట్రంలో మూడు డిస్కంలు ఉండగా, ఈపీడీసీఎల్ భారీ మిగులుతో మిగిలిన రెండు డిస్కంల నష్టాలను కూడా భర్తీ చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీపీడీసీఎల్ రూ.21.91 కోట్లు అధికంగా ఖర్చు చేయగా, ఎస్పీడీసీఎల్ ఏకంగా రూ.518.86 కోట్లు అధికంగా ఖర్చు చేసింది. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా పనిచేసే ఈపీడీసీఎల్ మాత్రం 1495.37 కోట్ల మిగులు చూపింది. ఈ విధంగా సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ చూపిన అధిక వ్యయాలను భర్తీ చేసి రికార్డు స్థాయిలో 940.07 కోట్ల మిగులను నమోదు చేసింది. దీంతో ప్రభుత్వం ఈ మొత్తం డబ్బును వినియోగదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విద్యుత్ బిల్లులను పెంచలేదని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వంలో ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ బిల్లుల మోత మోగేదని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చరిత్రలో లేనట్లు విద్యుత్ బిల్లులను తగ్గిస్తోందని చెబుతున్నారు. గత ప్రభుత్వం విధించిన ట్రూ అప్ చార్జీలు ఇంకా ఒక విడత పెండంగులో ఉన్నట్లు చెబుతున్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని సర్దుబాటు చేసేందుకు గత ప్రభుత్వం ట్రూ అప్ విధానం అవలంబించిందని అంటున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని సమీక్షించి కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవడంతో వినియోగదారులకు ఉపశమనం దక్కిందని అంటున్నారు. మొత్తానికి చరిత్రలో ఎన్నడూ లేనట్లు విద్యుత్ చార్జీలు రివర్స్ లో తగ్గడం చర్చనీయాంశంగా మారింది.