Begin typing your search above and press return to search.

ఒక ఏడాది : కూటమి, వైసీపీ ఏం చేశాయి?

ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రాజకీయం మరోసారి వేడెక్కింది.

By:  Tupaki Desk   |   4 Jun 2025 6:49 PM IST
ఒక ఏడాది : కూటమి, వైసీపీ ఏం చేశాయి?
X

ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రాజకీయం మరోసారి వేడెక్కింది. గత ఏడాది జూన్ 4న విడుదలైన ఎన్నికల ఫలితాలతో చారిత్రక విజయం సాధించి అధికారం చేపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, విపక్షం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట ఆందోళనలు నిర్వహించి రచ్చరచ్చ చేసింది. దీంతో అధికార, ప్రతిపక్ష కార్యక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఎన్నికల్లో గెలిచి ఏడాది అయిన సందర్భంగా కూటమి ఈ రోజును ప్రజా తీర్పు దినోత్సవంగా పరిగణిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా మంత్రివర్గ ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు గత ఏడాది కాలంగా చేపట్టిన కార్యక్రమాలపై మంత్రివర్గంలో చర్చించారు. ఏడాది కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, అందులో కార్యరూపం దాల్చిన ప్రాజెక్టులు, ఇప్పటివరకు అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, ఈ నెలలో అమలు చేయాల్సివున్న తల్లికివందనం, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలపై చర్చించారు. మరోవైపు జనసేన పార్టీ ఈ రోజు ‘‘పీడ విరగడైన రోజు’’గా అభివర్ణిస్తూ సంక్రాంతి, దీపావళి ఒకేసారి జరుపుకోవాలని పిలుపునిచ్చింది. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి విజయోత్సవం జరుపుకోవాలని మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించాలని సూచించింది. సాయంత్రం ఇళ్ల ముందు కళ్లాపి జల్లి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చింది.

ఇక కూటమి గెలిచి ఏడాది అయిన సందర్భంగా జూన్ 4 ప్రజా తీర్పు దినం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతేకాకుండా ‘‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు... ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు... అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు... సైకో పాలనకు అంతం పలికి.....ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు... ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు....ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు... పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు’’ అంటూ ట్వీట్ చేశారు.

ఏడాది క్రితం ప్రజలిచ్చిన అధికారంతో రాష్ట్ర పునర్నిర్మాణ కోసం బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నామని తన ట్వీట్ లో తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి...సంక్షేమాన్ని అందిస్తూ... అభివృద్ధి పట్టాలెక్కించామన్నారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు చంద్రబాబు ధన్యావాదాలు తెలిపారు.

ఇక ఇదే సమయంలో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. సూపర్ సిక్స్ హామీలు అంటూ హామీలిచ్చిన కూటమి పార్టీలు ఏడాదిగా సంక్షేమాన్ని అటకెక్కించాయని విమర్శిస్తూ ఈ రోజు వెన్నుపోటు దినంగా భావిస్తున్నట్లు ప్రకటించింది. ‘వెన్నుపోటు దినం’ అన్న పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైనట్లు వైసీపీ ప్రకటించింది. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం చేశారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల విమర్శలు చేశారు. తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. తమ సంక్షేమ పాలన పోయి సంక్షోభ పాలన వచ్చిందని కూటమి పాలనపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. కాగా, పార్టీ అధినేత జగన్ ప్రత్యక్షంగా ఎక్కడా వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనలేదు. అదే సమయంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సొమ్మసిల్లి పడిపోవడంతో కలకలం రేగింది.