వృద్ధి రేటులో ఏపీ ఎక్కడ ఉంది? చంద్రబాబు ప్రభుత్వంతో మార్పు వస్తోందా?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో సంపద పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నారు.
By: Tupaki Desk | 11 Sept 2025 10:07 AM ISTఏపీ ఆర్థికంగా నిలదొక్కుకుంటుందా? అంటే జాతీయ గణాంకాలు అవును అనే చెబుతున్నాయి. ఆర్థికంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలు నిజమవుతున్నాయి. పెట్టుబడులు, పరిశ్రమలు అంటూ యంత్రాంగాన్ని పరుగులు తీస్తున్న ప్రభుత్వం ఆ ఫలాలను అందుకుంటున్నట్లు తాజా లెక్కలు నిరూపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వృద్ధి రేటు జాతీయ సగటును మించి నమోదైందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్డీపీ 10.5% నమోదైంది. ఇది జాతీయ సగటు 8.8% కన్నా అధికం కావడం విశేషంగా చెబుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో సంపద పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నారు. మరోవైపు మౌలిక వసతులపై ద్రుష్టి పెట్టడంతో క్రమంగా రాష్ట్రాభివృద్ధి మెరుగుపడుతోందని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రికార్డు స్థాయిలో 9.58 శాతం వృద్ధిని నమోదు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ ఏడాది ఆ రికార్డును మించింది. 10.5% వృద్ధి రేటుతో జాతీయ సగటును అధిగమించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అంటున్నారు.
సుస్థిర ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ, ప్రతి త్రైమాసికంలో మెరుగైన వృద్ధి నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రెండు అంకెల వృద్ధి లక్ష్యాంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆర్థిక సంవత్సరంలో 17.1 శాతం వృద్ధి సాధనకు అధికారులకు టార్గెట్ విధించారు. దీనిలో భాగంగా తొలి త్రైమాసికంలోనే 10.5 శాతం నమోదు అయ్యేలా అధికారులు పనిచేశారు.
ఆర్థిక రంగానికి ఊతమిచ్చే పారిశ్రామిక, పర్యాటక రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది. పర్యాటక రంగంలో 25 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ముందుగా ఈ ఆర్థిక సంవత్సరంలో 17.08 శాతం లక్ష్యం నిర్దేశించింది. ఈ క్రమంలోనే అనేక కొత్త పర్యాటక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. విశాఖలో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ వంతెనతోపాటు కొత్తగా అనేక ప్రాజెక్టులను పరిచయం చేయాలని భావిస్తోంది. ఇక పారిశ్రామిక రంగంలో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన ప్రభుత్వం.. వాటిని వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేయాలని చూస్తోంది. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయని అంటున్నారు.
