Begin typing your search above and press return to search.

తూర్పు తీరానికి తిరుగులేదు.. రూ.9,000 కోట్లతో కీలక ప్రాజెక్టు

ఏపీకి వరప్రదాయినిలా చెప్పుకునే తూర్పు తీరం అభివృద్ధికి ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

By:  Tupaki Desk   |   22 Aug 2025 11:36 AM IST
తూర్పు తీరానికి తిరుగులేదు.. రూ.9,000 కోట్లతో కీలక ప్రాజెక్టు
X

ఏపీకి వరప్రదాయినిలా చెప్పుకునే తూర్పు తీరం అభివృద్ధికి ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరంలో పోర్టులు నిర్మించి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది. ముందుగా ఏపీఎం టెర్మినల్ అనే అంతర్జాతీయ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ఏపీ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.9,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. దీంతో ఆ రంగంలో సుమారు 10 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

సరుకు రవాణా, సముద్ర వాణిజ్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం గేట్ వేగా మార్చుకోవాలని భావిస్తోంది. గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో ఏపీఎం టెర్మినల్ సంస్థ, ఏపీ మారిటైమ్ బోర్డు మధ్య జరిగిన ఒప్పందంతో కీలక అడుగు పడినట్లు చెబుతున్నారు. సుమారు రూ.9 వేల కోట్లతో పోర్టులలో అత్యాధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎం సహకారంతో సరుకు రవాణా ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

రాష్ట్రంలో 1053 కిలీమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హర్బర్ నిర్మించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. పోర్టులు, హర్బర్ల నిర్మాణం జరిగితే సమీప నగరాలు, పరిశ్రమల నుంచి సరుకు రవాణా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేకాకుండా తెలంగాణ, చత్తీస్ ఘడ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తక్కువ ధరకే సరుకు రవాణా చేయొచ్చని చెబుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని రోడ్డు, రైలు, జల మార్గాలతో పోర్టుల కనెక్టవిటీకి అవసరమైన ప్రణాళికలు రెడీ చేయాలని ఏపీఎం సంస్థను ప్రభుత్వం కోరింది.

కాగా, స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా సముద్ర తీరాన్ని సంపద సృష్టికి వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత ఏడాది ఏపీ లాజిస్టిక్స్ పాలసీని తయారు చేసింది. మారిటైమ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని పోర్టుల అనుసంధానించాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో నాలుగు మేజర్ గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, నాలుగు ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఆర్థిక వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏపీఎం సంస్థతో అవగాహన ఒప్పందం కుదరడంతో 2026 ఏప్రిల్ నాటికి రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

ఇదే సమయంలో జువ్వలదిన్నె, నిజాంపట్నం ఫిషింగ్ హర్బర్ల పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ రెండు హర్బర్లు 2026 మార్చికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు వచ్చే మూడేళ్లలో పూడిమడక, బుడగట్లపాలెం, బియ్యపుతిప్ప, కొత్తపట్నం ఓడరేవులు, ఐదు ఫిషింగ్ హర్బర్ల ఫేజ్-2 నిర్మాణం నిర్వహణ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వం అనుకున్న సమయంలో పూర్తయితే ఏపీ తీరం సముద్ర రవాణాకు గేట్ వేగా మారుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.