Begin typing your search above and press return to search.

పుట్టపర్తికి డీఆర్డీవో భారీ ప్రాజెక్ట్.. రక్షణ రంగంలో ఏపీ నయా రికార్డ్!

ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడి విధానాలతో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.

By:  Tupaki Desk   |   10 May 2026 3:12 PM IST
పుట్టపర్తికి డీఆర్డీవో భారీ ప్రాజెక్ట్.. రక్షణ రంగంలో ఏపీ నయా రికార్డ్!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడి విధానాలతో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. గత 23 నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో దూసుకుపోతున్న ప్రభుత్వం తాజాగా రాయలసీమలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో యుద్ధ విమానాల ప్రాజెక్టు ప్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెబుతున్నారు.

సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు దేశ రక్షణ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించనుందని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమి, మౌలిక వసతులను సమకూర్చుతోంది. మే 15న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చేతుల మీదుగా పుట్టపర్తి ప్లైట్ టెస్టింగ్ సెంటర్ కు భూమి పూజ చేయనున్నారు. విమానాశ్రయం రన్ నిమిత్తం 150 ఎకరాల భూమి, అదనంగా టౌన్ షిప్, శాటిలైట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి 200 ఎకరాలు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి కేటాయించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో పుట్టపర్తి ఆధునిక యుద్ధవిమానాల అభివృద్ధికి ముఖ్య కేంద్రంగా మారనుందని చెబుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పుట్టపర్తి ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ లో ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుతోపాటు అనుబంధంగా వచ్చే పరిశ్రమల ద్వారా సుమారు లక్ష కోట్ల పెట్టుబడులు సమకూరుతాయని భావిస్తున్నారు.

కాగా, పుట్టపర్తి డీఆర్డీవో సెంటర్ లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సుమారు 140 అధునాతన మధ్యస్త విమానాలను తయారు చేయనున్నట్లు రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి. డీఆర్డీవో పర్యవేక్షణలో యుద్ధ విమానాల తయారీకి అవసరమైన వ్యవస్థల రూపకల్పన, విమానాల తుది కూర్పు నేలపైన నిర్వహించే పరీక్షల కార్యకలాపాలు పుట్టపర్తి కేంద్రంలో జరుగుతాయి. మరోవైపు డీఆర్డీవో నిర్మించనున్న ఈ కేంద్రంలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందని చెబుతున్నారు. ఎఏంసీఏ అభివృద్ధి తయారీ ప్రక్రియలో ‘టాటా అడ్వాన్సడ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు సహకరించనున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా మరిన్ని సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మరో 400 ఎకరాల భూమిని రెడీగా ఉంచిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.