Begin typing your search above and press return to search.

ఏపీ ఉద్యోగులకు దీపావళి కానుక! బకాయిలపై కాసేపట్లోనే కీలక ప్రకటన?

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి ఆమోదంతో ఈ రోజు సాయంత్రం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   18 Oct 2025 10:38 AM IST
ఏపీ ఉద్యోగులకు దీపావళి కానుక! బకాయిలపై కాసేపట్లోనే కీలక ప్రకటన?
X

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం నుంచి బకాయి పడిన డీఏతోసహా పలు ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయమై చర్చించేందుకు శనివారం సెక్రటేరియట్ లో 14 ఉద్యోగ సంఘాలతో ముగ్గురు మంత్రులు చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి మంత్రివర్గ సమావేశంలోనూ ఉద్యోగుల డీఏ బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలియజేసిందంటూ ఫేక్ ప్రచారం జరుగుతోంది. ఇది ప్రభుత్వాన్ని మరింత ఇటకారంలోకి నెట్టేస్తుండగా, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎస్ విజయానంద్ తో గత కొన్నిరోజులుగా ఈ విషయమై సుదీర్ఘంగా చర్చిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెండింగులో ఉన్న బకాయి మొత్తాన్ని రెండు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించారని సమాచారం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి ఆమోదంతో ఈ రోజు సాయంత్రం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం తరఫున ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను నియమించారు. ఉద్యోగుల ఆర్థికాంశాలపై సానుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి ఆయా సమస్యల పరిష్కారానికి రూట్ మ్యాప్ కనుగొనాలని మంత్రులకు సూచించింది. ఉద్యోగ సంఘాలతో చర్చల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆర్థిక శాఖ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక నోట్ సమర్పించారు. ఇందులో తక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు ఆర్థికంగా వెసులుబాటు లేదని తెలియజేసినట్లు సమాచారం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు మరికొంత సమయం తీసుకోవాలని ఆర్థిక శాఖ అధికారులు కోరినట్లు తెలుస్తోంది.

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 16 నెలలు అయినందున, మరింత సమయం తీసుకోవడం సబబు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కష్టమైనా సరే ఉద్యోగులకు పెండింగులో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించారని, ఈ విషయం తెలియజేయాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.7,500 కోట్ల మేర ఉద్యోగుల బకాయిలను తీర్చినట్లు తెలియజేయాలని సీఎం స్పష్టం చేశారు. 11వ పీఆర్సీ బకాయిలతోపాటు పెండింగులో ఉన్న 4 డీఏల్లో కనీసం రెండింటినైనా విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

2024లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల మేర బకాయిలు ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ 16 నెలల కాలంలో ఇది రూ.30 వేల కోట్లకు పెరిగినట్లు చెబుతున్నారు. కూటమి వచ్చాక రూ.7,500 కోట్లు చెల్లించినా, ఇంకా భారీగా బకాయిలు ఉండటంతో ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీనికితోడు హెల్త కార్డుల పెద్ద ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఉద్యోగులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను ఆదేశించారని చెబుతున్నారు. దీపావళి పండగ పురస్కరించుకుని ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై శుభవార్త చెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. మంత్రులు, ఉద్యోగ సంఘాల చర్చల్లో తుది నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రికి నివేదిస్తారు. ఆ తర్వాత ఈ రోజు రాత్రికి లేదా ఆదివారం ఉదయం ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు.