వారమే గడువు.. జిల్లాల విభజన ఏమైంది..?
రాష్ట్రంలోని 26 జిల్లాల విభజనతోపాటు.. మండలాల సరిహద్దులను కూడా మార్చి.. కొత్తగా ఏర్పాటు చేయాలని కూటమి సర్కారు ప్రయత్నించింది.
By: Garuda Media | 23 Dec 2025 11:10 AM ISTరాష్ట్రంలోని 26 జిల్లాల విభజనతో పాటు.. మండలాల సరిహద్దులను కూడా మార్చి.. కొత్తగా ఏర్పాటు చేయాలని కూటమి సర్కారు ప్రయత్నించింది. దీనికి సంబంధించి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో కమిటీని కూడా వేశారు. కొన్ని రోజులు హడావుడి నడిచింది. సీఎం చంద్రబాబు కూడా దీనిపై రెండు సార్లు సమీక్షించారు. కానీ, చిత్రంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మదనపల్లె, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
కానీ, ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. ఇక, నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని కొన్ని గ్రామాలను మార్పు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. సొంత పార్టీ నాయకులే వద్ద ని చెప్పారు. ఈ పరిణామాల తర్వాత.. ఈ వ్యవహారం మళ్లీ తెరమీదికి రాలేదు. ఇదిలావుంటే.. మరోవైపు గడువు ముగిసిపోతోంది. వచ్చే ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో కుల గణన ప్రారంభం కానుంది. దీంతో డిసెంబరు 29 వరకు మాత్రమే జిల్లాలు, మండలాల సరిహద్దులు మార్చేందుకు అవకాశం ఉంటుంది.
అయితే.. అధికారులు మాత్రం జిల్లాల విభజన ప్రక్రియ పూర్తయిందని.. దీనిపై సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ.. ఇప్పటి వరకు సీఎంవో వర్గాలు కానీ.. ముఖ్యమంత్రి కానీ.. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు. మరి జిల్లాలు, మండలాల విభజన ఉన్నట్టగా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు లేవు. అదేవిధంగా మదనపల్లె డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది.
ఈ రెండు కాకుండా.. ఇతర జిల్లాలు, మండలాల విభజన అంశం మాత్రమే ఎటూ తేల్చడం లేదు. మరో వైపు పార్వతీపురం మన్యం జిల్లాను విడదీసి.. మరో జిల్లా ఏర్పాటు చేసే వ్యవహారం కూడా కొలిక్కి రాలేదు. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాలను మార్చాలని టీడీపీ నాయకులు కోరారు. కానీ, ఇది కూడా వర్కవుట్ కావడం లేదు. వెరసి ఒకవైపు సమయం మించి పోతుండగా.. మరోవైపు, ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిమౌనంగా ఉండడాన్ని బట్టి.. ఇప్పుడు వద్దులే అనుకున్నారా? లేక.. స్పందిస్తారా? అనేది చూడాలి.
