పెద్ద నంబరే...వారందరికీ పెన్షన్ రాదంతే !
ఏపీలో సంక్షేమ పథకాలు సర్కార్ కి గుదిబండగా మారుతున్నాయి. ఎక్కడ లేని నిధులూ సంక్షేమ పధకాలకే ఖర్చు చేయాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 10:00 PM ISTఏపీలో సంక్షేమ పథకాలు సర్కార్ కి గుదిబండగా మారుతున్నాయి. ఎక్కడ లేని నిధులూ సంక్షేమ పధకాలకే ఖర్చు చేయాల్సి వస్తోంది. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మూడు వేల రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్ ని నాలుగు వేలకు పెంచేసింది. అంతే కాదు దివ్యాంగుల పెన్షన్ ఏకంగా ఆరు వేల రూపాయలు చేసింది.
అయితే ఒక వైపు పెన్షన్ ఇస్తూనే మరో వైపు అనర్హులను ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. పెద్ద ఎత్తున అనర్హులను దివ్యాంగుల జాబితాలోకి చేర్చారని ఫలితంగా వారంతా కలసి ఏపీలో ఎనిమిది లక్షల మంది దాకా ఉన్నారని లెక్క తేలిందని అంటున్నారు.
ఇందులో సగానికి సగం మంది అసలు పెద్దగా లోపాలు లేకున్నా అంగ వికలత్వం ఉంది అన్న సర్టిఫికేట్ ని తెచ్చుకుని మరీ పెన్షన్లు భారీ ఎత్తున పొందుతున్నారు అన్న ఆరోపణలు వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి కూడా ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏరివేత కార్యక్రమం మొదలు పెట్టింది.
ఈ దెబ్బతో దివ్యాంగులు అందరికీ మళ్ళీ పరీక్షలు అని కూడా వైద్యూ వర్గాల ద్వారా చేయిస్తోంది. ఇలా కొత్తగా వైద్య పరీక్షలు చేయించుకుని అధికార సర్టిఫికెట్ తో వస్తేనే వారికి పెన్షన్లు ఇస్తామని చెబుతున్నారు. అయితే ఈ పరీక్షలకు రాకుండా ఇప్పటికే యాభై వేల మంది దాకా దూరంగా ఉన్నారుట. అంటే వారికి తాము అనర్హులమవుతామని తెలుసా అన్న చర్చ వస్తోంది.
ఇంకో వైపు చూస్తే కనుక మొత్తం ఎనిమిది లక్షల మందిలో కేవలం మూడు లక్షల మంది మాత్రమే వికలాంగులుగా తేలింది అని అంటున్నారు. మిగిలిన వారిలో చూస్తే తక్కువ శాతమే అంగ వికలత్వం ఉందని అంటున్నారు. ఇలా తక్కువ శాతం ఉన్నా కూడా అధికంగా చూపిస్తూ పెన్షన్లు తీసుకుంటున్నారు అన్నది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందంట.
ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికి తేలిన దాని ప్రకారం చూస్తే ఒక లక్షం మందికి పైగా దివ్యాంగులకు ఈ నెల నుంచి పెన్షన్ కట్ అని అంటున్నారు. వాస్తవంగా చూస్తే ఇది చాలా పెద్ద నంబర్ గా ఉంది. అయితే దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లు మామూలు మొత్తాలు కావు. ఆరు వేల నుంచి మొదలుపెడితే పది వేలు పదిహేను వేల రూపాయల దాకా ఇస్తున్నారు.
మరి ఇంత పెద్ద మొత్తాలు కాబట్టే అందుకోవడానికి చాలా మంది మాల్ ప్రాక్టీస్ కి పాల్పడుతున్నారు అని అంటున్నారు. ఇక తక్కువ అంగ వికలత్వం ఉన్న వారు కూడా తాము దివ్యాంగులమే అని క్లెయిం చేస్తున్నారు. దాంతో మరో విడత అంటే ఈ ఏడాది నవంబర్ దాకా వైద్య శిబిరాలు నిర్వహించి అసలైన దివ్యాంగుల సంఖ్య ఎంతో లెక్క పక్కాగా తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మీదట ఒక అధికారిక నంబర్ ని విడుదల చేస్తారు. వారికే అప్పటి నుంచి కచ్చితంగా పెన్షన్ దక్కుతుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే సామాజిక పెన్షన్లలోనూ అనేక మంది అనర్హులు ఉన్నారని చెబుతున్నారు. వీరి ఏరివేత కూడా చురుకుగా సాగుతోంది అని అంటున్నారు. ఆర్తులకు నిస్సహాయులకు పెన్షన్ ఇవ్వడం సమంజసం కానీ అనర్హులకు ఇచ్చుకుంటూ పోతే ఖజానాకు భారమే కాకుండా అర్హులకు సైతం ఒక దశలో అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అందువల్ల అనర్హులను ఏరివేయాలన్న డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది.
ఇక రేషన్ కార్డులకు ఈకేవైసీ కూడా జూన్ 30తో గడువు ముగుస్తోంది. దాంతో రేషన్ కార్డులలో కూడా అనర్హులను ఏరివేస్తే చాలా పెద్ద నంబరే అవుతుంది అని అంటున్నారు. ప్రతీ సంక్షేమ పధకానికి తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఉంది. దాంతో ఇక్కడ నుంచే ప్రక్షాళన మొదలుపెడితేనే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పధకాలకు సార్ధకత ఉంటుందని అలాగే ఆసలైన అర్హులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. మొత్తానికి అనర్హుల ఏరివేత అన్నది తప్పనిసరి అన్న మాట అయితే అంతా ఏకీభవిస్తున్నారు. ఇది శుభ పరిణామం అని కూడా అంటున్నారు.
