Begin typing your search above and press return to search.

పవన్ జిల్లా టూర్లు ఎప్పటి నుంచి ?

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా టూర్లు ఉంటాయా ఉంటే ఎప్పటి నుంచి అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 3:27 AM GMT
పవన్ జిల్లా టూర్లు ఎప్పటి నుంచి ?
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా టూర్లు ఉంటాయా ఉంటే ఎప్పటి నుంచి అన్న చర్చ సాగుతోంది. ఆ మధ్యన అయితే జరిగిన ప్రచారం బట్టి చూస్తే సంక్రాంతి తరువాత పవన్ కళ్యాణ్ జిల్లా టూర్లు చేస్తారని క్షేత్ర స్థాయిలో పర్యటించడం ద్వారా పరిస్థితులను మొత్తం తెలుసుకుంటారని అంటూ వచ్చారు.

అయితే ఇపుడు ఆ చర్చ అయితే పెద్దగా సాగడం లేదు. అనూహ్యంగా మధ్యలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నాగబాబు వచ్చారు. ఆయన జనంలోకి జనసేన పేరుతో పర్యటనలు చేసేందుకు పార్టీ కార్యక్రమాలను రూపొందించింది. దాంతో పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు ఇప్పట్లో ఉంటాయా లేక వాయిదా పడినట్లా అన్న చర్చ సైతం సాగుతోంది.

అయితే ఏపీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు పరిస్థితుల నేపథ్యంలో పవన్ లో ప్రొఫైల్ ని మెయింటెయిన్ చేయాలని నిర్ణయించుకున్నారా అన్నది కూడా చర్చ సాగుతోంది. పవన్ గత కొన్నాళ్ళుగా ఒక్కసారిగా జోరు పెంచారు ఆయన కీలక ప్రకటనలు కూడా చేస్తూ వచ్చారు. కాకినాడ పోర్టు దాకా వెళ్ళి సీజ్ ద షిప్ అని అన్నా అది పెద్ద వైరల్ న్యూస్ అయింది.

దాని కంటే ముందు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ మీద ఆయన మాట్లాడితే అది హైలెట్ న్యూస్ అయిపోయింది. తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా ఆయన క్షమాపణలు టీటీడీ పెద్దలు చెప్పాలని చేసిన డిమాండ్ అయితే అల్టిమేట్ అయింది. దాంతోనే రాజకీయ కలకలం చెలరేగింది.

కూటమి ప్రభుత్వానికి సమాంతరంగా పవన్ తాను ఒక అధికార కేంద్రంగా ముందుకు సాగుతున్నారని టీడీపీ అనుకూల మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి. పవన్ హైలెట్ కావడంతో ఎక్కడ లోకేష్ వెనకబడిపోతున్నారో అని ఆలోచించిన తమ్ముళ్ళు ఆయన యంగ్ టీం అంతా కలసి ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ కి ఇవ్వాలని ఒక స్లోగన్ అందుకున్నారు.

దాంతో అది కాస్తా కూటమిలో రాజకీయ చిచ్చుని రాజేసేలా కొంత దూరం వెళ్ళింది. చివరికి టీడీపీ జనసేన అధినాయకత్వాలు అలెర్ట్ కావడంతో అది చివరికి టీ కప్పులో తుఫానుగా మిగిలిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ ఏకైక ఉప ముఖ్యమంత్రి అన్నది కూడా అర్ధం అయింది.

అయితే ఈ పరిణామాల తరువాత మళ్ళీ పోటీ రాజకీయాలు అన్న ప్రశ్నలు కానీ చర్చ కానీ రాకుండా జనసేన అధినాయకత్వం కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయని లుకలుకలు చోటు చేసుకుంటున్నాయన్న సంకేతాలను సందేశాన్ని వినిపించడం వల్ల ప్రత్యర్ధి వైసీపీకే లాభం అన్నది కూడా గ్రహించడం వల్లనే కాస్తా లో ప్రోఫైల్ లో ఉండాలని పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారా అన్నది చర్చగా ఉంది.

అందుకే పవన్ కి బదులుగా నాగబాబుని జనంలోకి పంపించడం జరిగిందా అని కూడా అనుకుంటున్నారు. ఇక జనంలోకి వెళ్ళిన నాగబాబు పుంగనూరు సభలో కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలలలో చేసిన అనేక కార్యక్రమాలను గురించి హైలెట్ చేస్తూ మాట్లాడారు. ఇదే తీరున ఒక వైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ మరో వైపు కూటమి ప్రభుత్వ విజయాలను కూడా ఏకరవుపెడుతూ ముందుకు సాగాలని జనసేన భావిస్తోంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చేది ఎపుడు అంటే దానికి కొంత సమయం పడుతుందని అది ఇపుడే కాదని అంటున్నారు.