పవన్ సార్.. ఇదీ మీ బాధ్యతే.. ఇంకా ఆర్నేల్లే టైము!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పరిధిలో శాఖలపై స్పష్టమైన ముద్ర వేస్తున్నారు.
By: Tupaki Desk | 10 Dec 2025 6:00 PM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పరిధిలో శాఖలపై స్పష్టమైన ముద్ర వేస్తున్నారు. పంచాయతీరాజ్, అటవీ శాఖలను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆయా శాఖల్లో వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఆ మధ్య శేషాచలం అడవుల్లో కాలిబాటన రెండు కిలోమీటర్లు నడిచి ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేతను అడ్డుకునే యాక్షన్ ప్లాన్ ను రెడీ చేశారు డిప్యూటీ సీఎం. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పల్లెపండుగ, పశువుల హాస్టళ్లు వంటి కార్యక్రమాలతో అభివృద్ధి పరుగులు తీయిస్తున్నారు. తాజాగా పల్లె పండుగ-2.0 ను ప్రారంభించారు. అదే సమయంలో ఎప్పటి నుంచో పంచాయతీరాజ్ అధికారులు డిమాండ్ చేస్తున్న పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొత్తగా డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను సృష్టించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మినీ కలెక్టరేట్ల మాధిరిగా డీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. అయితే ఇలా తన పనితీరుతో పంచాయతీరాజ్ శాఖను పరుగులు పెట్టిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ ఓ ముఖ్యమైన పనిని విస్మరించారని అంటున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభుత్వం దృష్టి సారించింది. విభజన సమయంలో 13గా ఉన్న జిల్లాలను గత వైసీపీ ప్రభుత్వం 26కు పెంచింది. ప్రతిపార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం అరకు పార్లమెంటును రెండు జిల్లాలుగా విభజించడంతో 25 పార్లమెంటు నియోజకవర్గాలు 26 జిల్లాలు అయ్యాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా మరో మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలో జనగణన ప్రారంభం కానున్నందున వీలైనంత త్వరగా కొత్త జిల్లాలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో పోలవరం, మదనపల్లె, మర్కాపురం జిల్లాలకు త్వరలో గెజిన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇలా జిల్లాలను విభజిస్తున్న ప్రభుత్వం.. జిల్లా పరిషత్ ల విభజనను విస్మరించడంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లా పరిషత్తులు ఉండాల్సివుంది. అయితే వైసీపీ ప్రభుత్వం జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 13 ఉమ్మడి జిల్లాలకు 13 జిల్లా పరిషత్తుల ద్వారా పాలనా వ్యవహారాలు సాగిస్తున్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే జిల్లా పరిషత్తులను విభజించడంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా శీతకన్ను వేసినట్లు చెబుతున్నారు. అయితే జిల్లా పరిషత్ లకు పాలక వర్గాలు ఉండటంతో ప్రస్తుతం విభజన సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. కానీ, మరో ఆరు నెలల్లో జిల్లా పరిషత్తు పాలక వర్గాల పదవీకాలం పూర్తికానుండటంతో ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
కొత్తగా డీడీవో వ్యవస్థను తీసుకువచ్చిన డిప్యూటీ సీఎం తన శాఖ పరిధిలో జిల్లా పరిషత్ విభజనపై దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నారు. మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాతైనా జిల్లా పరిషత్తులపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ దృష్టికి ఈ సమస్య రాలేదా? లేక సమయం ఉందని వదిలేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం ముందుగా మేల్కొంటే కొత్త జిల్లాలకు జిల్లా పరిషత్ కార్యాలయాలను సమకూర్చుకోవడం అవుతుందని, లేని పక్షంలో కలెక్టరేట్ల వలే అద్దె భవనాలలో కొనసాగాల్సివస్తుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ తలచుకుంటే జిల్లా పరిషత్తుల విభజన వెంటనే మొదలయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.
