Begin typing your search above and press return to search.

ఏపీకి 88 సీట్లు పెంపు.. పార్టీల‌కు ప్ర‌యోజ‌నం ఎంత ..!

నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న అంశంపై కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

By:  Garuda Media   |   24 March 2026 11:30 PM IST
ఏపీకి 88 సీట్లు పెంపు.. పార్టీల‌కు ప్ర‌యోజ‌నం ఎంత ..!
X

నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న అంశంపై కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ లెక్క‌న ఏపీలో ప్ర‌స్తుత అసెంబ్లీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి ఏకంగా 263 స్థానాల‌కు చేరుతాయి. ఒకే సారి 88 స్థానాలు పెరిగేందుకు అవ‌కాశం ఉంది. వాస్త‌వానికి జ‌నాభా ప్రాతిపదిక‌న పెంచుకోవాల్సిన సీట్ల వ్య‌వ‌హా రంపై.. ముందుగానే అంచ‌నా వేసి.. ఆ మేర‌కు పెంచితే ఎవ‌రికీ ఇబ్బందులు రావు. కానీ.. ఏపీ స‌హా.. అనేక రాష్ట్రాల‌కు రాజ‌కీయ ప్రాధాన్యాలే ముఖ్యంగా సీట్ల పెంపు జ‌రుగుతోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీల‌కు మాత్ర‌మే నాయ‌కులు ఇబ్బడి ముబ్బ‌డిగా ఉన్నారు. వారికి ఈ నిర్ణ‌యం కొంత వ‌రకు మేలు చేసే అవ‌కాశం ఉంది. నిజానికి అప్ప‌టికీ.. 88 సీట్లు పెరుగుతుండ‌డంతో ఆయా పార్టీల‌కు కూడా నాయ‌కుల కొర‌త క‌నిపించే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ, వైసీపీల‌కు నాయ‌కుల కొర‌త పెద్ద క‌ష్టం కాక‌పోవ‌చ్చు. కానీ, జ‌న‌సేన‌, బీజేపీ, కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టు లు వంటి కీల‌క పార్టీల‌కు ఈ పెంపు శ‌రాఘాత‌మేన‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న 175 సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకే.. జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్‌ల‌కు నాయ‌కుల కొర‌త కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. గత 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు నాయ‌కులు లేక కొన్ని స్థానాల‌ను వ‌దులు కోవాల్సి వ‌చ్చింది. కేవ‌లం 148 స్థానాల్లో నే జ‌న‌సేన పోటీ చేసింది. ఇక‌, క‌మ్యూనిస్టులు.. పొత్తు పెట్టుకుని కూడా.. నాయ‌కుల కోసం వెతుకున్నారు. అంటే.. కొద్దిపాటి స్థానాల‌కు కూడా.. వారికి నాయకులు లేకుండా పోయారు. ఇక‌, కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది.

కొత్త నాయ‌కుల‌ను ప్రోత్స‌హిస్తే..

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో .. 2029 ఎన్నిక‌ల నాటికి.. కొత్త నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తేనే.. ఈ లోటు తీరుతుంద‌న్న చ‌ర్చ ప్రారంభ‌మైంది. కానీ, రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు చ‌దువుకున్న యువ‌త ముందుకు రావ‌డం లేదనేది వాస్త‌వం. పైగా పార్టీల్లో ఉన్న క్యాడ‌ర్‌కు పోటీకి నిల‌బ‌డే శ‌క్తి, ఆర్థిక స్తోమ‌త కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకుని.. అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే.. ప్ర‌తి ప‌దేళ్ల‌కు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు అవ‌కాశం ఉంటుంది. లేక‌పోతే.. ఒకేసారి సీట్లు పెంచినందున‌.. వ‌చ్చే ప్ర‌యోజ‌నం క‌న్నా.. న‌ష్ట‌మే ఎక్కువ‌గా ఉంటుంద‌న్నది ప‌రిశీల‌కులు చెబుతున్న‌మాట‌.