Begin typing your search above and press return to search.

అచ్యుతాపురం అసెంబ్లీ సీటు...కూటమి నేతల రేసు

ఈ నేపధ్యంలో అచ్యుతాపురం కొత్త అసెంబ్లీ సీటు అవుతుందని వార్తలు రావడంతో ఆ వైపుగా అంతా చూస్తున్నారు.

By:  Satya P   |   12 April 2026 9:21 AM IST
అచ్యుతాపురం అసెంబ్లీ సీటు...కూటమి నేతల రేసు
X

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అన్నది తెలిసిందే. ఏపీలో అయితే ఏకంగా 88 సీట్లు కొత్తవి వచ్చి చేరబోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే ప్రస్తుతం ఉన్న 15 సీట్లు కాస్తా 23 దాకా పెరగబోతున్నాయి. ఇందులో ఎక్కడ సీట్లు వస్తాయన్న ఊహాగానాల మధ్య ఎవరికి వారు కన్ ఫర్మ్ చేసుకుంటూ ముందస్తుగా కర్చీఫ్ వేసేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి సీటు ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఎలమంచిలి మరో అసెంబ్లీ సీటు ఉంది. ఈ రెండింటి మధ్య కొన్ని మండలాలను విడదీసి అచ్యుతాపురం పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు.

ఉద్దండ రాజకీయం :

ఉమ్మడి విశాఖ జిల్లా అయినా అనకాపల్లి జిల్లా అయినా రాజకీయాలకు కేంద్ర స్థానం మాత్రం అనకాపల్లి మాత్రమే. ఇక్కడ నుంచే ఎంతో మంది ఉద్ధండులు అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళ్లారు. ఇక 2024 లో చాలా మంది అనకాపల్లి నుంచి పోటీ చేయాలని చూశారు. కానీ చివరి నిముషంలో అనూహ్యమైన వ్యక్తులు రంగంలోకి దిగిపోయారు. దాంతో ఆశావహులు డీలా పడ్డారు. ఇపుడు వారి ఆశలు నెరవేర సమయం వచ్చింది అని సంతోషిస్తున్నారు. దానికి కారణం కొత్తగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్న తీయని వార్తలు వినిపించడమే. దాంతో దిగ్గజ నేతలు అంతా పెరగబోయే సీటులో తమ కొత్త రాజకీయం వినూత్నంగా మొదలెట్టేశారు.

మూడు సామాజిక వర్గాలు :

అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో మూడు సామాజిక వర్గాలు ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తాయి. గవరలు, కాపులు వెలమలు ఇక్కడ రాజకీయంగా ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఇక 2024 ఎన్నికల్లో చూస్తే సిట్టింగ్ నాయకులకు టికెట్లు దక్కలేదు, ఎంపీ సీటుకు అయితే ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన సీఎం రమేష్ కి లక్కీ చాన్స్ వచ్చింది. దీంతో ఎంపీగా పోటీ చేయాలని చూసిన చాలా మంది నీరు కారిపోయారు. అలాగే మాజీ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన పీలా గోవింద సైతం జనసేనకు అనకాపల్లి అసెంబ్లీ సీటు పోవడంతో నిరాశపడ్డారు. మరో వైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన కుమారుడి కోసం సీటు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అలాగే మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది టీడీపీ లో సీటు కోసం పట్టుబట్టి భంగపడ్డారు.

ఆశాకిరణంగా అక్కడ :

ఈ నేపధ్యంలో అచ్యుతాపురం కొత్త అసెంబ్లీ సీటు అవుతుందని వార్తలు రావడంతో ఆ వైపుగా అంతా చూస్తున్నారు. కూటమి నుంచి దాడి వీరభద్రరావు కుటుంబం సీరియస్ గానే ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. అలాగే అదే టీడీపీలో ఉన్న ఇతర నేతలు ఆశిస్తున్నారు. ఇక కూటమి పార్టీలలో బీజేపీలో కొత్తగా చేరిన ఒక పారిశ్రామికవేత్త కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు అంటున్నారు. జనసేనకు అనకాపల్లి సీటు ఉంది. మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అనకాపల్లి కాకపోతే అచ్యుతాపురం అయినా ఇవ్వాలని కోరే చాన్స్ ఉంది అని అంటున్నారు.

వైసీపీ నుంచి సైతం :

కేవలం టీడీపీ కూటమి నేతలు మాత్రమే కాదు వైసీపీ నుంచి కూడా అచ్యుతాపురం ఎమ్మెల్యే సీటు అయితే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాంతో ఈ నియోజకవర్గం పరిధి ఎంత ఏమిటి అన్నది వాకబు చేస్తూ తమ ప్రయత్నాలలో వారు ఉన్నారు. మరి అచ్యుతాపురం ఎవరిని వరిస్తుందో మరెవరిని జో అచ్యుతానందా అని జో కొడుతుందో చూడాల్సి ఉంది.