'ఈ అమరావతి రచ్చ' ఎందాకా? ఎవరు తగ్గాలి ..!
ఇది పెను దుమారంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించి.. నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలకు కూడా ఈ వ్యవహారం పాకింది. సాక్షి కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
By: Tupaki Desk | 10 Jun 2025 10:30 AM ISTరాష్ట్రంలో రాజుకున్న 'డిబేట్ల రచ్చ' ఎందాకా సాగుతుంది? ఎప్పటికి ఇది కుదురుకుంటుంది? అనేది ఆసక్తిగా మారింది. ఈ నెల 6న సాక్షి టీవీలో జరిగిన చర్చలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు .. మంటలు రేపాయి. అమరావతి పరిధిలో 'ఆ తరహా' మహిళలు ఉన్నారని.. అందుకే అది 'ఆ తరహా రాజధాని' అని నోరు చేసుకున్నారు. ఇది పెను దుమారంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించి.. నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలకు కూడా ఈ వ్యవహారం పాకింది. సాక్షి కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఇక, దీనికి కౌంటర్‌గా వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో సోమవారం ప్రతిదాడి జరిగింది. ఇటు డిబేట్లలోనూ.. అటు నాయకుల పరంగా కూడా.. పెద్ద ఎత్తున ఎదురు దాడి కనిపించింది. అంతేకాదు.. నాయకులు కూడా వాడి వేడిగానే స్పందించారు. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణరెడ్డి చేసిన 'సంకర జాతి' వ్యాఖ్యలు మరింతగా హైలెట్ అయ్యాయి. వీటిపైనా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అంబటి రాంబాబు వంటి నాయకులు కూడా.. ఈ నిరసనలను తప్పుబట్టారు. ఈ క్రమంలో మరింత వేగం పుంజుకుంది.. అదేసమయంలో వాడి వేడి కూడా పెరిగింది.
ఈ పరిణామాలను గమనిస్తే.. ప్రస్తుతం రాజుకున్న ఈ వేడి ఇప్పట్లో తగ్గేదేలేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇదిలావుంటే.. మరో టీవీ చర్చలో జగన్‌ను తీవ్రంగా అవమనిస్తూ.. కేంద్ర మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్య లు మరింత ఆజ్యం పోశాయి. ఇప్పటి వరకు.. ఉన్న చర్చ ఇప్పుడు మరో తరహాలోకి మారింది. ఇలాంటి పరిస్థితిలో ఈ రచ్చ మరింత పెరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్రంలోనూ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఇవి ఎప్పటికి తగ్గుతాయనే ప్రశ్న.
ఈ విషయంలో రెండు రకాలుగా పరిష్కారాలు ఉన్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట. 1) ప్రభుత్వం పరంగా వీటిని తగ్గించే చర్యలు తీసుకోవడం. మహిళలను కించ పరిచేవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం.. తక్షణమే రంగంలోకి దిగిన నేపథ్యంలో మున్ముందు కూడా ఇలానే వ్యవహరిస్తామని హామీ ఇవ్వడం ద్వారా కొంత మేరకు తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. ఇక, 2) వైసీపీ అధినేత జగన్ కానీ, ఆయన సతీమణి భారతి కానీ.. నేరుగా రంగంలోకి దిగి వివాదాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం. ఈ రెండు జరిగితే తప్ప.. ప్రస్తుతం నెలకొన్న వివాదం సర్దుమణిగే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.