అతి పెద్ద కుట్ర జరుగుతోంది...టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో కావాలనే పెద్ద కుట్ర జరుగుతోందని ఇది దళితులందరి మీద జరుగుతున్న భారీ కుట్ర అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Satya P | 6 May 2026 12:29 PM ISTఏపీలో కావాలనే పెద్ద కుట్ర జరుగుతోందని ఇది దళితులందరి మీద జరుగుతున్న భారీ కుట్ర అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన తాజాగా దళిత క్రైస్తవ సమైక్య సభలో మాట్లాడుతూ పలు హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో చూస్తే మొత్తానికి మొత్తం దళితుల రిజర్వేషన్లకు ఎసరు పెట్టే కుట్ర సాగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాదు ఏపీలో ఉన్న దళితులు అంతా క్రిస్టియన్లే అని చెప్పడం వెనక ఉద్దేశ్యాలు ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.
అంతా ప్రణాళిక ప్రకారం :
జరుగుతున్నది అంతా ఒక ప్రణాళిక ప్రకారమే అని కొలికపూడి పేర్కొన్నారు. మొదట దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు రద్దు అన్నారు. ఆ తరువాత చూస్తే ఏపీలో ఉన్న వారు అంతా దళిత క్రిస్టియన్లే అని అంటున్నారని ఆయన మండిపడ్డారు దీనిని బట్టి మొత్తం దళితులకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని అని ఫైర్ అయ్యారు. ఎస్సీలకు రిజర్వేషన్లు రద్దు అని నేరుగా చెప్పలేక ఈ తరహాలో ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. బహిరంగంగా దళితులకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పే దమ్మూ ఎవరికీ లేదని అలా కనుక చెబితే వారి కూసాలు కదిలిపోతాయని కొలికపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
క్రైస్తవులు అని ముద్ర :
క్రైస్తవులు అని ముద్ర వేసి రిజర్వేషన్లు ఎగ్గొట్టాలని చూస్తున్నారు అని కొలికపూడి మండిపడ్డారు. ఆ విధంగా ఎవరికీ రిజర్వేషన్లు లేకుండా చేస్తే అసలు అడగరని భావిస్తున్నారని ఆయన అన్నారు. ఇంతకీ దళితులు చర్చిలకు వెళ్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. దళితులు తమకు ఇష్టమైన ఏ మతాన్ని అయినా విశ్వసిస్తే తప్పేంటి అని ఆయన నిలదీశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఇది ఉందని ఆయన అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రాధమిక హక్కులు పౌరులకు ఉన్నాయని అందులో మత స్వేచ్చ ఒకటి అని కొలికపూడి చెప్పారు. ఆర్టికల్ 25, 26, 27, 28 లలో పౌరుడి మత స్వేచ్చ ప్రాధమిక హక్కుగా రాజ్యంగం పేర్కొంది అన్నారు. అందువల్ల దళితులు ఎవరైనా చర్చికి వెళ్ళవచ్చు, లేదా గుడికి దర్గాకు మసీదుకు ఎక్కడికైనా పోవచ్చు అని అన్నారు. అది రాజ్యాంగం వారికి ప్రసాదించిన ప్రాధమిక హక్కుగా ఆయన చెప్పారు.
మా నాన్న వెంకన్న భక్తుడు :
నా తండ్రి కొలికపూడి సుబ్బారావు వెంకటేశ్వరస్వామి భక్తుడని అందుకే తనకు కొలికపూడి శ్రీనివాసరావు అని పేరు పెట్టారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అయితే నా తల్లి మంగమ్మ చర్చికి వెళ్తుందని ఆయన చెప్పారు. తన తల్లిని చిన్నప్పటి నుంచి ప్యాకెట్ మనీ కోసం అడిగితే బైబిల్ చదివితే డబ్బులు ఇచ్చేదని ఆయన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. తన చిన్నప్పుడు ఒక వైపు హైందవ మత పద్ధతులు అలాగే క్రైస్తవ మత విధానాలను వింటూ పెరిగాను అని ఆయన చెప్పారు. చదువుకుని పెద్ద అయిన తరువాత బౌద్ధ మతం ఈ దేశానికి మేలు అయినది అని నమ్మానని చెప్పారు. అయినా ఎవరి మత విశ్వాసాలు వారివని ఎమ్మెల్యే అంటూ ఏ మతం ఎవరు ఆచరిస్తే ఎందుకు బాధ అని ప్రశ్నించారు. దళితులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద కొలికపూడి చేసిన తాజా వ్యాఖ్యలు అయితే సంచలనం రేపుతున్నాయి. అసలే టీడీపీలో రెబెల్ గా ఉన్న ఆయన ఇపుడు సరికొత్త సామాజిక ఉద్యమ పంధాను ఎంచుకున్నారా అన్నది అంతా విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి కొలికపూడి తరువాత స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో.
