Begin typing your search above and press return to search.

ఏపీ మండలిలో తీవ్ర ఉద్రికత్త.. మతాలపై అచ్చెన్నాయుడి షాకింగ్ కామెంట్స్

ఏపీ శానసమండలి సమావేశాలు తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై బుధవారం మండలిలో చర్చ జరిగింది.

By:  Tupaki Political Desk   |   4 March 2026 5:47 PM IST
ఏపీ మండలిలో తీవ్ర ఉద్రికత్త.. మతాలపై అచ్చెన్నాయుడి షాకింగ్ కామెంట్స్
X

ఏపీ శానసమండలి సమావేశాలు తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై బుధవారం మండలిలో చర్చ జరిగింది. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి మండలి చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. మరోవైపు వైసీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చి మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభను స్తంభింపజేశారు. మంత్రి అచ్చెన్నాయుడు తన గురించి తప్పుగా మాట్లాడారని చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.

తిరుమల లడ్డూ కల్తీపై చర్చ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ఓ మతం పేరు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాను ఒక భక్తుడిగా ప్రతి రోజు ఈ విషయంలో నరకం అనుభవిస్తున్నానని అన్నారు. శానసమండలిలో బాధ కలుగుతోంది. నాకు బాధ కలుగుతోంది. వెంకటేశ్వరస్వామి పవిత్రతను దారుణంగా దెబ్బతీస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో చైర్మన్ మోషేన్ రాజు, మీ నాయకుడు (జగన్మోహనరెడ్డి) ఒక మతానికి చెందిన వారంటూ వ్యాఖ్యానించారు.

మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకున్న చైర్మన్ మోషేన్ రాజు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అయితే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనంటూ అచ్చెన్నాయుడు మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. చైర్మన్ మోషేన్ రాజు సైతం అంతేస్థాయిలో గట్టిగా మాట్లాడారు. మంత్రి తన మాటలను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ తేల్చిచెప్పారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడి వద్దకు సహచర మంత్రులు వచ్చి ఏదో చెప్పగా, తాను మాట్లాడతానని అవకాశం ఇవ్వాలని చైర్మన్ ను కోరారు.

తన మతం కోసం మాట్లాడటానికి మంత్రి అచ్చెన్నాయుడికి ఏ అర్హత ఉందని చైర్మన్ ప్రశ్నించారు. క్షమాపణ చెబితేనే అవకాశం ఇస్తానని తేల్చిచెప్పారు. చైర్మన్ మోషేన్ రాజు గట్టిగా అడగటంతో మంత్రి అచ్చెన్నాయుడు వెనక్కి తగ్గారు. తాను భేషజాలకు వెళ్లనని, చైర్మన్ ఒక మతానికి చెందిన వారు అని అనుకున్నానని, ఆయనే స్వయంగా ఆ మతస్తుడిని కాను అని చెప్పడంతో తన మాటను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే మంత్రి తన మాటలను వెనక్కి తీసుకోవడం కాదని, సభలో క్షమాపణ కోరాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభ కొనసాగకుండా పోడియం వద్ద ఆందోళన చేశారు.

వైసీపీ సభ్యుల అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందగోళం నెలకొంది. మంత్రి అచ్చెన్నాయుడు తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో వివాదం సమసిపోయిందని చైర్మన్ రూలింగ్ ఇచ్చినప్పటికీ వైసీపీ సభ్యులు వినిపించుకోలేదు. సభను స్తంభించేలా ఆందోళన చేయడంతో చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటే సభను నడుపుతానని స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. ఆ తర్వాతే సభ ఆర్డర్ లోకి వచ్చింది.