ఏపీ మండలి చైర్మన్ కు ‘చెక్’.. ఎమ్మెల్సీల మాస్టర్ ప్లాన్!
ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Political Desk | 4 March 2026 1:53 PM ISTఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు. వీరంతా తమ పదవులకు రాజీనామా చేసినా, వాటిని చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిపిన విచారణలో కూడా తమ రాజీనామాలు ఆమోదించాలని చైర్మన్ ను కోరినప్పటికీ ఆయన నిర్ణయం తీసుకోవడంలో తాత్సార్యం చేస్తున్నారని ఎమ్మెల్సీలు చెబుతున్నారు. ఈ కారణంగా చైర్మన్ మోషేన్ రాజు కు చెక్ చెప్పేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీలు తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీలు ఆ పార్టీపై అసంతృప్తితో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. కొందరు రాజీనామాలు చేసి దాదాపు ఏడాది దాటింది. అయినప్పటికీ చైర్మన్ మోషేన్ రాజు ఆ రాజీనామాలను ఆమోదించ లేదని చెబుతున్నారు. దీంతో ఆయననే పదవి నుంచి తప్పించాలని రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు డిసైడ్ అయ్యారు. మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్, సీనియర్ నేత మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ తదితరులు గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. తర్వాత రాజకీయ సమీకరణాలు మారడం, వీరు వైసీపీలో ఇమడలేమంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అదేసమయంలో నైతిక ధర్మం పేరుతో తమ పదవులను వదులుకుంటున్నట్లు ప్రకటించారు.
నిబంధనల ప్రకారం, శాసనమండలి ఫార్మట్ లో పూర్తి సమ్మితితో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసినా చైర్మన్ మోషేన్ రాజు ఉద్దేశపూర్వకంగా ఆమోదించడం లేదని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. చైర్మన్ మోషేన్ రాజు రాజకీయ కారణాలతో తమ రాజీనామాలకు అడ్డుపడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై చైర్మన్ పదవిని స్వీకరించిన మోషేన్ రాజు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సివుందని, కానీ ఆయన వైసీపీ పక్షపాతంతో తమ రాజీనామాలు ఆమోదించడం లేదని ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైర్మన్ పై అవిశ్వాసానికి సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు చైర్మన్ పై అవిశ్వానికి ప్రతిపాదనలు చేస్తున్నారని, వీరితో మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు చేతులు కలపొచ్చని ప్రచారం జరుగుతోంది. మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు అవిశ్వాసానికి సిద్దమవుతున్నట్లు మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉండగా, అవిశ్వాస తీర్మానం పరవేశపెట్టాలంటే 10 మంది సభ్యులు ముందుగా నోటీసు ఇవ్వాల్సివుంటుందని చెబుతున్నారు. ఇక సభలో ప్రస్తుతం టీడీపీ కూటమికి కేవలం 13 మంది సభ్యుల బలం ఉంది. వీరితో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు 6, ఇండిపెండెంట్లు 5 చేతులు కలిపినా చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గడానికి ఇంకా ముగ్గురు సభ్యుల బలం అవసరం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం సభలో వైసీపీకి 28 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు సభ్యులు కూటమి ప్రభుత్వంతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన ఆరుగురితోపాటు ఈ ఇద్దరు కూడా అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో శాసనమండలి రాజకీయం రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగానే చైర్మన్ పై ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రయోగం చేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఐదుగురు ఇండిపెండెంట్లు కలిసి వస్తేనే అవిశ్వాసం నెగ్గుతుందని, లేదంటే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చైర్మన్ మోషేన్ రాజు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోందని అంటున్నారు.
