మండలిలో అంబటి మంటలు.. లోకేశ్ సీరియస్ వార్నింగ్
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి శాసనమండలిలో విస్తృత చర్చకు దారితీసింది.
By: Tupaki Political Desk | 13 Feb 2026 4:50 PM ISTమాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి శాసనమండలిలో విస్తృత చర్చకు దారితీసింది. శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి ప్రస్తావనకు వచ్చింది. మండలి ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ అంబటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా దాడి చేయడమేంటి అంటూ నిలదీశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరిచ్చారంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంబటి విజ్ఞత ఉన్న వ్యక్తిగా వ్యాఖ్యానించారు. బొత్స ప్రసంగాన్ని అధికార పార్టీ సభ్యులు అడ్డుకున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి, అందుకు దారి తీసిన పరిణామాలపై శాసన మండలిలో హాట్ డిబేట్ జరిగింది. వైసీపీ పక్ష నేత బొత్స మాట్లాడుతూ ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని, కానీ దాడి చేసినందుకు అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకోడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమయంలో మంత్రి లోకేశ్ కల్పించుకుని ఘాటుగా స్పందించారు. మహిళల జోలికి ఎవరు వెళ్లినా వదిలపెట్టమని తేల్చిచెప్పారు. తల్లి, చెల్లి జోలికి వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎవరి తల్లి అయినా ఎవరి చెల్లి అయినా సరే తాము రక్షిస్తామని, మహిళలను అవమానించేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రెండు చిన్నమాటలు అన్నారని అంబటిని వెనకేసుకువచ్చారని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ సందర్భంగా తాము అలా అనలేదని బొత్స సమాధానం ఇవ్వగా, తాను మిమ్మల్ని అనలేదని మీ పార్టీకి అధ్యక్షుడు మీరు కాదని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెంగళూరులో ఉండే నాయకుడు గుంటూరు వచ్చి రెండు చిన్న మాటలు అన్నారని వెనకేసుకు వచ్చారని మరింత రెట్టించేలా లోకేశ్ ఎదురుదాడి చేశారు. దీంతో విపక్ష నేత బొత్స కల్పించుకుని అంబటి క్షమాపణ కోరినా దాడి చేశారన్న వాదనకు కట్టుబడి మరింత గట్టిగా అధికార పార్టీ సభ్యులతో వాదనకు దిగారు.
ఇళ్లపై దాడి చేయడం ఏం సంస్కృతి అంటూ ప్రశ్నించారు. బొత్స ఆరోపణలపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ నెల్లూరులో తమ శాసనసభ్యురాలిపై వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్త భారతీరెడ్డిని అవమానిస్తే తాము వెంటనే అరెస్టు చేసి రిమాండుకు తరలించామని చెప్పారు. మీరు ఐదేళ్లపాటు ఏం చేశారని నిలదీశారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు కరెక్టా? కదా? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్ ప్రశ్నకు స్పందించిన విపక్ష నేత బొత్స మాట్లాడుతూ అంబటిని రెచ్చగొట్టేలా కొందరు వ్యవహరించారని, ఆయనను ఆయన తల్లిని తిట్టారని అన్నారు. ఏ తల్లిని అవమానించినా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ బొత్స తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. అంబటి తల్లిని ఎవరు అవమానించారని, అందుకు తగిన ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో మంత్రి లోకేశ్ మళ్లీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిని అవమానించేలా మాట్లాడితే వదిలేస్తామని ఎలా అనుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
ఇక సభలో లేని అంబటిపై దాదాపు అరగంట పాటు విస్తృత చర్చ జరిగింది. రాంబాబు వంటి వ్యక్తి కోసం ఎలా మాట్లాడుతున్నారని అధికార పక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా, ప్రభుత్వ తీరు సరిగా లేదని విపక్షం విరుచుకుపడింది. ఈ సందర్భంగా రాంబాబు గతంలో చేసిన ప్రకటనలు, గురువారం జైలు వద్ద తగ్గేదేలే అంటూ చేసిన సైగలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. పోలీసులు తన కుక్కను కూడా టచ్ చేయలేరన్న వ్యాఖ్యల వల్లే అరెస్టు చేయాల్సివచ్చిందని హోంమంత్రి అనిత తెలిపారు. మొత్తానికి అంబటి ఎపిసోడ్ శాసనమండలిని వేడెక్కించింది.
