డిలిమిటేషన్ లెక్కలు : ముఖ్య నేతలకు రిస్క్, లిస్టులో చంద్రబాబు, జగన్!!
రాష్ట్రంలో ఓట్లు పరంగా అతిపెద్ద నియోజకవర్గం భీమిలి. ఇక్కడ సుమారుగా 3 లక్షల 55 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా అంటే దాదాపు ఒక లక్షా 80 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
By: Tupaki Political Desk | 26 March 2026 10:00 PM ISTనియోజకవర్గాల పునర్విభజన అంశం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అదనంగా నియోజకవర్గాలు పెరుగుతున్న ఆనందం ఒకవైపు ఉంటే, మహిళా రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం చాలా మంది నేతలకు టెన్షన్ కు గురిచేస్తోంది. ఏపీలో మొత్తం స్థానాలు 263కి పెరగనుండగా, ఇందులో 80 సీట్లు మహిళలకు రిజర్వు కానున్నాయి. అయితే ఈ రిజర్వేషన్ల మూలంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మంది నేతలు తమ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
మహిళల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలుచేసే అవకాశం కనిపిస్తుండటంతో నేతలు తమ నియోజకవర్గాల్లో జనాభా లెక్కలను ఆరా తీస్తున్నారు. ఇక పలువురు సీనియర్లు, ముఖ్య నేతల స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఈ జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, విపక్ష నేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పేర్లు చేరనున్నాయా? అనే చర్చ ఉత్కంఠ రేపుతోంది.
రాష్ట్రంలో ఓట్లు పరంగా అతిపెద్ద నియోజకవర్గం భీమిలి. ఇక్కడ సుమారుగా 3 లక్షల 55 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా అంటే దాదాపు ఒక లక్షా 80 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా గాజువాక, పెనమలూరు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలు కూడా ఓట్లు పరంగా భీమిలి తర్వాత స్థానంలో నిలిచాయి. ఈ నియోజకవర్గాల్లో సైతం మహిళా ఓటర్లు అధికంగానే ఉన్నారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలు కూడా డీలిమిటేషన్ తర్వాత మహిళలకు రిజర్వు అవుతాయా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2.30 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు 1.17 లక్షలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో మొత్తం ఓట్లు 2.34 లక్షలు ఉంటే మహిళా ఓటర్లు 1.19 లక్షల మంది ఉన్నారు. మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో మొత్తం ఓటర్లు 2.95 లక్షలు ఉంటే ఇందులో మహిళలు 1.51 లక్షలు, ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గం పులివెందులలో సైతం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. పులివెందులలో మొత్తం ఓటర్లు 2.34 లక్షలు కాగా, మహిళా ఓటర్లు 1.19 లక్షలుగా ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో సగం కన్నా ఎక్కువగా మహిళలే నమోదు అవడంతో సీనియర్లు రిజర్వేషన్ల జ్వరం పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఏపీలో సగటున ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లు పురుషుల కంటే 2 నుంచి 4 శాతం అధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకే సంక్షేమ పథకాలు, రాజకీయ సమీకరణాల్లో ‘మహిళా ఓటు బ్యాంక్’పై పార్టీలు, నేతలు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారని అంటున్నారు. అయితే ఇప్పుడు చట్టప్రకారం మహిళా నేతలకు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఏర్పడటంతో మొత్తం సమీకరణలు మారిపోనున్నాయని అంటున్నారు.
